డిమాండ్లు ఇవే : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 04:49 AM IST
డిమాండ్లు ఇవే : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. 5 నెలలుగా స్కాలర్ షిప్ లు అందడం లేదని జూడాలు ఆందోళన చేస్తున్నారు. శిక్షణ లేని ఆర్ఎంపీ, పీఎంపీలతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ ను విడుదల చేయాలని జూడాలు సమ్మె చేయనున్నారు. ఇప్పటికే కాలేజీ ప్రిన్సిపల్స్, మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్ కు వినతి పత్రాలు అందజేశారు. డీఎంఈను కలిశారు. అయినప్పటికీ తమ సమస్య పరిష్కారం కావడం లేదని కాబట్టి విధులను బహిష్కరించి తాత్కాలిక సమ్మెకు దిగుతున్నామని చెబుతున్నారు. స్కాలర్ షిప్ లను విడుదల చేయని ఎడల పూర్తి స్థాయిలో విధులను బహష్కరించి సమ్మెకు దిగుతామని జూడాలు హెచ్చరిస్తున్నారు. 

మరోవైపు ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకుతోడుగా కొత్తగా ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈటల రాజేందర్ శిక్షణ లేని ఆర్ఎంపీ, పీఎంపీలతో భేటీ కావడాన్ని జూడాలు వ్యతిరేకిస్తున్నారు. ఆర్ఎంపీలకు డిగ్రీలు ఉండవు, శిక్షణ కల్గివుండరని తెలిపారు.

డిమాండ్లు ఇవే :
– పెండింగ్ స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి
– ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వాలనే ఆలోచనను విరమించుకోవాలి
– డాక్టర్ల నియామకాలు చేపట్టాలి
– ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి