కాళేశ్వరం ట్రయల్ రన్ : ప్రాజెక్ట్ పనుల్లో కీలక ఘట్టం

  • Published By: chvmurthy ,Published On : April 17, 2019 / 04:32 AM IST
కాళేశ్వరం ట్రయల్ రన్ : ప్రాజెక్ట్ పనుల్లో కీలక ఘట్టం

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో బుధవారంనాడు తొలిసారిగా గోదావరి నీటితో వెట్‌ రన్‌ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది జూన్‌ నుంచే గోదావరి జలాలను పంట పొలాలకు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పంప్‌హౌస్‌లలో మోటార్ల  డ్రై రన్‌ నిర్వహించిన ఇంజనీర్లు సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు తొలి పరిశీలనలో భాగంగా బుధవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారంలోని ప్యాకేజీ–6కి నీటిని విడుదల చేయడానికి ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ఈ పనులతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానానికి పునాది పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిని  2019, ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేసేందుకు అధికారులు నిమగ్నమై ఉన్నారు.  ఈ నేపథ్యంలో ఎల్లంపల్లిలో లభ్యతగా ఉన్న 8.46 టీఎంసీల నీటిలో 0.25 టీఎంసీల నీటిని వినియోగించి బుధవారం ట్రయల్‌ రన్‌ చేయడానికి ఇంజనీర్లు అంతా సిద్ధంచేశారు. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 7, 8 ఉండగా, వీటిలో ప్యాకేజీ–6 ద్వారా ఎల్లంపల్లి నుంచి నందిమేడారం రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా పనులు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, ఆ తర్వాత 9.53 కిలోమీటర్ల మేర 11 మీటర్ల వ్యాసం కలిగిన జంట టన్నెళ్ల ద్వారా ప్యాకేజీ–6లోని సర్జ్‌పూల్‌కు నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ల ద్వారా ప్యాకేజీ–7కు నీటిని తరలించాలి. అయితే ఈ ప్యాకేజీలో టన్నెల్, గ్రావిటీ కాలువ పనులు పూర్తవగా ఐదు మోటార్లు సిద్ధమయ్యాయి. మరో రెండు మోటార్ల పనులు జరుగుతున్నాయి. 

ప్రస్తుతం వెట్‌ రన్‌లో భాగంగా 0.25 టీఎంసీ నీటిని గ్రావిటీ కాలువ, టన్నెల్‌ ద్వారా వదిలి సర్జ్‌పూల్‌ను నింపుతారు. అయితే, సర్జ్‌పూల్‌ను ఒకేసారి కాకుండా విడతల వారీగా నింపుతారు. ముందుగా 10శాతం వరకు, తర్వాత 25 శాతం వరకు, ఆ తర్వాత 50శాతం వరకు.. ఇలా వంద శాతం వరకు నింపుతూ వెళతారు. ప్రతిసారీ సర్జ్‌పూల్‌లో కానీ, టన్నెళ్లలో కానీ ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయోమోనని పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన నాలుగైదు రోజుల తర్వాత మళ్లీ ఒక్కో మోటార్‌ను ఆన్‌ చేసి పరిశీలిస్తారు. ఈ పంపుల్లో మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇబ్బందులేవైనా ఉంటే గుర్తించేందుకు ఈ ట్రయల్‌ రన్‌ దోహదపడుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.ఈ ప్రక్రియకు మొత్తం రెండు నెలలు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. అనంతరం ప్యాకేజీ–7లోని టన్నెళ్ల నిర్మాణం పూర్తయ్యాక ప్యాకేజీ–8లోని పంపులను కూడా ఇదే విధంగా పరిశీలిస్తారు.