పార్టీ బలోపేతంపై కేసీఆర్ నజర్! : జిల్లాల పర్యటనకు శ్రీకారం

  • Published By: madhu ,Published On : December 10, 2020 / 06:31 AM IST
పార్టీ బలోపేతంపై కేసీఆర్ నజర్! : జిల్లాల పర్యటనకు శ్రీకారం

KCR Focus : దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్‌. సొంత జిల్లా సిద్ధిపేట నుంచి కేసిఆర్ పర్యటనలు మొదలు కానున్నాయి. 2020, డిసెంబర్ 10వ తేదీ గురువారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిద్దిపేటలో ప్రారంభించనున్న కేసీఆర్.. అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్మాణం పూర్తయిన కార్యాలయాల ప్రారంభోత్సవాలకు ముహూర్తం ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.




పార్టీ కార్యాలయాల నిర్మాణం :-

గులాబీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్న సూచనలు చేశారు. పార్టీని సంస్థాగతంగా బలంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలను నిర్మించాలని ఏడాదిన్నర క్రితం నిర్ణయం తీసుకున్నారు. దసరా పండుగ నాటికి నిర్మాణాలను పూర్తి చేయాలని భావించినా కరోనా, లాక్ డౌన్ కారణాలతో నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు దాదాపు తుది దశకు చేరుకొన్నాయి. నిర్మాణం పనులు పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటుండటంతో… వాటిని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో తొలి పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.




కార్యకర్తలకు శిక్షణ :-

పార్టీ కార్యాలయాలు అన్నీ అందుబాటులోకి వచ్చిన వెంటనే కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల కోసం శిక్షణ శిబిరాలు నిర్వహించినట్లుగా పార్టీ కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని గుర్తించే పనిలో పార్టీ పెద్దలు ఉన్నారు. దాదాపు 60 లక్షల మంది కార్యకర్తల సభ్యత్వం పార్టీకి ఉంది. వీరిలో శిక్షణ కోసం ఎంతో మంది కార్యకర్తలను ఎంపిక చేయాలి… వారికి ఏ అంశాలపై శిక్షణ ఉండాలన్న దానిపై సీఎం కేసీఆర్ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.





సోషల్ మీడియా వారియర్స్ :-

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో నియోజక వర్గాల వారిగా సోషల్ మీడియా వారియర్స్‌ను ప్రత్యేకంగా నియామకం చేయనుంది టీఆర్ఎస్‌. అదే సమయంలో రాష్ట్రస్థాయి నేతలకు కూడా శిక్షణా శిబిరాలను నిర్వహించే యోచనలో గులాబీ పార్టీ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ మరోసారి పార్టీ బలోపేతంపై స్వయంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.