కేసీఆర్‌ సర్కార్-2కు ఏడాది : సంక్షేమ పథకాల అమల్లో దూకుడు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మలిదశ పాలనకు నేటితో(డిసెంబర్ 11,2019) ఏడాది. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన వ్యూహాలతో

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 03:16 AM IST
కేసీఆర్‌ సర్కార్-2కు ఏడాది : సంక్షేమ పథకాల అమల్లో దూకుడు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మలిదశ పాలనకు నేటితో(డిసెంబర్ 11,2019) ఏడాది. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన వ్యూహాలతో

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మలిదశ పాలనకు నేటితో(డిసెంబర్ 11,2019) ఏడాది. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన వ్యూహాలతో ప్రతిపక్ష పార్టీలు అయోమయంలో పడ్డాయి. ఏడాది సమయంలో ప్రభుత్వం కూడా కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కోక తప్పలేదు.

సాధారణ ఎన్నికలకు దాదాపు ఏడాది ముందుగానే శాసనసభను రద్దు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా తీర్పుకి వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీ భారీ మెజార్టీతో మరోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. తొలివిడత ప్రభుత్వంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలనే రెండోసారీ నమ్ముకుంది. 2018 ఎన్నికల్లో పెన్షన్లు పెంచుతూ… వయోపరిమితిని తగ్గిస్తామని హామీ ఇచ్చింది. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండోసారి పెన్షన్‌కు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టింది. వితంతు, వికలాంగులకు హామీ మేరకు పెన్షన్లు అందజేస్తోంది. కొత్త లబ్ధిదారులకు త్వరలో పెన్షన్లు అందజేసే అవకాశముంది.

రైతుబంధు పథకాన్ని తొలివిడత నుంచి అమలు చేస్తున్నా… రెండో విడతలో ఎకరాకు 6వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం అమల్లో ఆర్థికమాంద్యం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఐదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు… రైతుబంధు పథకం అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా… ఆర్థికమాంద్య పరిస్థితుల కారణంగా రుణమాఫీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. రైతు బీమా పథకాన్ని మాత్రం ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగునీటి సమస్యను పూర్తిగా అధిగమిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ విడతలో కూడా సాగునీటి ప్రాధాన్యతనిచ్చి… కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేయాలని భావిస్తోంది. దుమ్ముగూడెం దగ్గర భారీ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది.

రెండో విడతలో తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చింది ఇంటర్‌ ఫలితాలే. ఇంటర్ ఫలితాల్లో తప్పులతో విద్యార్థులు ఉద్యమబాట పట్టక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాల్యుయేషన్‌ ప్రక్రియలో పొరపాట్లతో ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిరుద్యోగ భృతి విషయంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. మాంద్యం కారణంగా ఈ పథకం అమల్లో మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది.

కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక… అత్యంత సంచలనంగా మారిన వ్యవహారం ఆర్టీసీ సమ్మె. ఆర్టీసీ కార్మికులు దాదాపు రెండు నెలల పాటు సమ్మె చేశారు. సమ్మె కాలంలో కేసీఆర్ కఠినంగా వ్యవహరించినా… విరమణ అనంతరం కార్మికులకు వరాలు కురిపించారు. ఆర్టీసీలో సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో చోటుచేసుకున్న దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. కానీ, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీలను ఖాళీ చేశారు. ముందస్తు ఎన్నికల్లో 88 స్థానాలు సాధించి సంపూర్ణ విజయాన్ని కైవసం చేసుకున్న అధికార పార్టీ… అసెంబ్లీలో విపక్షాలను ఆత్మరక్షణలో వేసింది. కేసీఆర్ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను సభలో కోల్పోవాల్సి వచ్చింది. మిత్రపక్షమైన ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కింది.

టీఆర్‌ఎస్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాయి పార్లమెంట్‌ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికలపై అతి విశ్వాసాన్ని ప్రదర్శించిన అధికార పార్టీ… 16 స్థానాల్లో విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేసింది. కానీ.. అనూహ్యంగా వచ్చిన ఫలితాలు గులాబీ నేతలకు షాకిచ్చాయి. కీలక స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడం… విపక్షాలు ఏడు స్థానాల్ని కైవసం చేసుకోవడంతో అధికారపార్టీకి తొలి ఏడాదిలోనే హెచ్చరికలు అందినట్లయింది. కానీ హుజూర్‌నగర్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొంది… ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించుకుంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్‌.