ఆర్టీసీ సమ్మె : చర్చలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్‌. కోర్టు చెప్పిన కమిటీకి అంగీకరిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయి?

  • Edited By: veegamteam , November 13, 2019 / 03:25 AM IST
ఆర్టీసీ సమ్మె : చర్చలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ad

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్‌. కోర్టు చెప్పిన కమిటీకి అంగీకరిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయి?

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్‌. కోర్టు చెప్పిన కమిటీకి అంగీకరిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయి? అంగీకరించకపోతే.. కోర్టు ఎలా ముందుకు వెళ్లనుందన్న వివరాలను సీఎం ఆరా తీశారు. అలాగే బుధవారం(నవంబర్ 13,2019) హైకోర్టులో ప్రభుత్వం వినిపించాల్సిన వాదనలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్‌. 

సమ్మె విషయంలో ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు ధర్మాసనం ప్రకటించిన నేపథ్యంలో.. ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి వచ్చి ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్‌. దీనిపై హైకోర్టులో వినిపించాల్సిన వాదనను ఖరారు చేసినట్లు సమాచారం. దీంతోపాటు సమ్మె, ప్రైవేట్‌ బస్సులకు రూట్‌ పర్మిట్ల కోసం ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోణంలో.. ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ హైకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని సూచించినట్లు సమాచారం. 

అంతకుముందు కోర్టు వ్యాఖ్యలను అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ సీఎంకు వివరించారు. ఇంతదాకా వచ్చిన తర్వాత మళ్లీ చర్చలకు వెళ్లడం అవసరం లేదని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీఎస్‌ జోషి తెలిపారు. కార్మిక శాఖతో జరిగిన రాజీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే కార్మిక నేతలు బయటకు వచ్చేశారని.. అలాంటప్పుడు మళ్లీ వాళ్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఏముందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. మరోవైపు జేఏసీ మాత్రం చర్చలకు ఇప్పటికైనా సిద్ధమేనని ప్రకటించింది.