ఫెడరల్ ఫ్రంట్ : కేసీఆర్ ఏపీ టూర్ !

  • Published By: madhu ,Published On : January 26, 2019 / 11:33 AM IST
ఫెడరల్ ఫ్రంట్ : కేసీఆర్ ఏపీ టూర్ !

పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు
ఫిబ్రవరిలో అమరావతికి వెళ్లే అవకాశం
ఫెడరల్ ఫ్రంట్ వైపు వైసీపీ అడుగులు
కేటీఆర్, జగన్ మధ్య తొలిదశ చర్చలు
అమరావతి కేంద్రంగా రెండోదఫా చర్చలు

హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్.. ఏపీ కేంద్రంగా రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్నారు. వైసీపీని ఫెడరల్ ఫ్రంట్‌లోకి చేరిపించేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. త్వరలోనే కేసీఆర్ ఏపీలో పర్యటించేందుకు సిద్ధమౌతున్నారు. ఆయన టూర్ చేపట్టాలనుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

ఇంకా కొన్ని రోజులే…ఏపీ రాష్టంలో కేసీఆర్ అడుగు పెట్టేందుకు. పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్…త్వరలోనే ఆ రాష్ట్రంలో టూర్ చేయనున్నారు. తెలంగాణలో అన్నిస్థానాల్లో గెలుపు తథ్యమన్న ధీమాతో ఉన్న గులాబీ దళపతి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు. దీనికోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్.. ఫిబ్రవరి నెలలో ఏపీ రాజధాని అమరావతిలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ చేపట్టబోతున్న ఈ పర్యటన పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది.

అమ‌రావ‌తి ప‌రిధిలో జగన్ నూతన ఇంటి నిర్మాణం
ఫిబ్రవరి 14న గృహప్రవేశానికి ఏర్పాట్లు
గృహప్రవేశానికి కేసీఆర్ ను ఆహ్వానించే అవకాశం
కేసీఆర్ హాజరుపై వెలువడని అధికారిక ప్రకటన
కేసీఆర్, జ‌గ‌న్ భేటీ ఖాయ‌మ‌ంటున్న గులాబీ కేడర్

ఏపీలోని ప్రధానపార్టీ టీడీపీ ఇప్పటికే యూపీఏలో చేరిపోగా… మరోపార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక హోదా నినాదంతో జాతీయ పార్టీల‌కు దూరంగా ఉంటోంది. ఈ స‌మ‌యంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చొర‌వ చూపిస్తుండ‌డంతో… జగన్ పార్టీ ఇటువైపు అడుగులు వేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇటీవ‌లే టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్‌లో జ‌గ‌న్‌తో ప్రత్యేకంగా సమావేశమై రెండు గంట‌ల పాటు చర్చలు జరిపారు. రెండో ద‌శ చ‌ర్చలు అమరావతి కేంద్రంగా జరపాలని నిర్ణయించారు.

అమ‌రావ‌తి ప‌రిధిలో జగన్ నూతన ఇంటిని నిర్మించుకున్నారు. ఫిబ్రవరి 14న గృహప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించే అవ‌కాశాలున్నాయి. అయితే… కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేనప్పటికీ ఇటు టీఆర్ఎస్, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ దీనిపై ఇప్పటికే చర్చ మొదలైంది. కేసీఆర్ టూర్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినా… అమ‌రావ‌తిలో కేసీఆర్, జ‌గ‌న్ భేటీ కావ‌డం ఖాయ‌మ‌ంటున్నారు గులాబీ నేతలు. తెలంగాణాలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన టీడీపీని… ఏపీలోనూ  ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు రచిస్తారని చెబుతున్నారు. మొత్తంగా ఏపీలో ఎన్నిక‌ల ముందు కేసీఆర్, జగన్ భేటీ జరిగితే… రాజ‌కీయ ప‌రిణామాలు ఎలా మారతాయన్నదానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా చర్చలు సాగుతున్నాయి.