గంగమ్మ ఒడికి గణేశుడు : ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి

  • Published By: madhu ,Published On : September 12, 2019 / 07:04 AM IST
గంగమ్మ ఒడికి గణేశుడు : ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి

ఖైరతాబాద్‌లో కొలువుదీని శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జనోత్సవం పూర్తయ్యింది. అశేష భక్తులు వెంటరాగా గురువారం(సెప్టెంబర్ 12,2019) మధ్యాహ్నం 1.45 గంటలకు హుస్సేన్ సాగర్‌లో జల ప్రవేశం చేయించారు. గణపతి బప్పా మోరియా..నినాదాలు మిన్నంటాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ గణేశుడిని తొలి నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ గణేష్ మంటపం నుంచి ఉదయం శోభాయాత్ర ప్రారంభమైంది. యాత్రను చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం రాత్రి కలశం పూజ అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రక్ మీదకు భారీ వినాయక విగ్రహాన్ని ఎక్కించారు..ఇందుకు భారీ క్రేన్ ఉపయోగించారు. అనంతరం గణేషుడికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా..వెల్డింగ్ పనులు చేశారు. 61 అడుగుల ఎత్తు 45 టన్నుల బరువున్న విగ్రహాన్ని తరలించేందుకు ఆధునికమైన టెక్నాలజీని వాడారు. మెల్లిమెల్లిగా హుస్సేన్ సాగర్ వైపుకు తరలించారు. సెన్సేషన్ థియేటర్ మీదుగా బయల్దేరి టెలిఫోన్ భవన్ వైపుగా వచ్చి తెలంగాణ సచివాలయం నుంచి లుంబిని పార్క్ వైపుగా సాగర్ వైపుకు తరలించారు. 

ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్ద కాకుండా క్రేన్ నెంబర్ 6 వద్ద నిమజ్జనం చేశారు. సగం మాత్రమే నిమజ్జనం అవుతుండడంపై ప్రజల నుంచి వ్యతిరేకత, నిరుత్సాహం ఎదురైంది. దీంతో విగ్రహం పూర్తిగా నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, ఇతర అధికారులు చొరవతో నిమజ్జనం చేసే స్థలాన్ని మార్చారు. క్రేన్ నెంబర్ 06 వద్ద 20 అడుగుల మేర లోతు ఉన్నట్లు నిపుణులు సూచించారు. దీంతో అక్కడే భక్తుల కేరింతల మధ్య ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనాన్ని చేశారు. 
Read More : మహా నిమజ్జనం : నిఘా నీడలో హైదరాబాద్