కేసీఆర్ కార్మికుల పక్షపాతి : కేటీఆర్

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 08:42 AM IST
కేసీఆర్ కార్మికుల పక్షపాతి : కేటీఆర్

సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కార్మికుల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. మేడే వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. గడిచిన ఐదేళ్లలో కేసీఆర్ హయాంలో కార్మికుల సమస్యలను పరిష్కరించారని తెలిపారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించారని చెప్పారు. మూతపడ్డ పరిశ్రమలను తెరిపించారని తెలిపారు. కేసీఆర్ ఆశీర్వాదంతో రామగుండం ఫర్టిలైజర్, సిర్పూర్ పేపర్ మిల్లు, బాల్లపూర్ ఇండస్ట్రీస్ ను తెరిపించారని తెలిపారు. కొత్త పరిశ్రమలకు పెద్ద పీట వేశామని చెప్పారు. పారిశ్రామికీకరణకు ఊతమివ్వడం ద్వారా కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించడం, మూతపడ్డ పరిశ్రమలను తెరిపించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నాణ్యమైన జీతం, నాణ్యమైన జీవితం వచ్చే విధంగా ముఖ్యమంత్రి త్రిముఖ వ్యూహంతో పని చేశారని తెలిపారు. 
Also Read : మావోల దాడి : 15 మంది జవాన్ల మృతి

గడిచిన ఐదేళ్ల కాలంలో అంగన్ వాడీ టీచర్ల జీతాలను 4వేల 500 నుంచి పది వేల 500 రూపాయలకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంగన్ వాడీ టీచర్లకు రెండు సార్లు జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. మినీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు రూ. 2 వేల 500 నుంచి 6 వేలకు జీతాలను పెంచినట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు గౌరవ వేతాన్ని రూ.7 వేల 500 లకు, వీఆర్ ఏలకు జీతం 6 వేల నుంచి పది వేల 700 లకు పెంచామని తెలిపారు. ఐకేపీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచామన్నారు. 25 వేల విద్యుత్ కాంట్రాక్టర్లను సంస్థలో విలీనం చేసి.. వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు జీతాలు పెంచామని తెలిపారు.