మున్సిపల్‌ ఎన్నికలు : 9 మందితో టీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటీ

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 04:09 AM IST
మున్సిపల్‌ ఎన్నికలు : 9 మందితో టీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటీ

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా 9 మందితో కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రకటించారు. ఈ కమిటీ ప్రతి మున్సిపాలిటీలోని  పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల కోసం స్థానిక నాయకత్వానికి సహకారం అందిస్తుంది. ఈ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌ రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, నేతలు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొంతు రామ్మోహన్, గట్టు రాంచందర్‌రావు, దండె విఠల్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రావు ఉన్నారు. 

వీరు జిల్లాల వారీగా ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో మాట్లాడాలని కేటీఆర్‌ సూచించారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారానికి అవసరమైన సమాచారాన్ని అందించాలన్నారు. సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 14 తేదీ వరకు పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన రెబల్‌ అభ్యర్థులతో మాట్లాడి, వాటిని ఉపసంహరించుకునేలా చూడాలన్నారు. సాధ్యమైనన్ని ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేయాలన్నారు. 

ఇదిలావుంటే గురువారం (జనవరి 9, 2020) టీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్టీ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇంచార్జీలకు ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని చెప్పాలని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమావేశంలోనే డమ్మీ ఫామ్స్ భర్తీ చేసి చూపించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల బరిలో మనకు పోటీ ఎవరూ లేరని తెలిపారు. పోటీ లేకున్నా ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం ఫలితాలు మనకే అని ధీమా వ్యక్తం చేశారు.
 
బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను వివరించారు. ఎన్నికల్లో విజయానికి వ్యూహాలు వివరించారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు వేసే సందర్భంగా తీసుకునే జాగ్రత్తలు, ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన ప్రణాళికలు నేతలకు వివరించారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. పోటీ తవ్రంగా ఉండటంతో రెబల్స్ బెడద లేకుండా చూడాలని సూచించారు. టిక్కెట్లు ఆశించిన వారితోపాటు నాయకులందరినీ అభ్యర్థులు సమన్వయం చేసుకోవాలని చెప్పనున్నారు. ఒక్కమున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి ఊడుతుందని నేతలకు ఇప్పటికే కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సీఎం ముందుగా వచ్చినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడంపై కేసీఆర్ సీరియస్ కావడంతో వారంతా సైలెంట్ అయిపోయారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. వీరితోపాటు పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా వచ్చారు.