ఎందుకీ వివక్ష : కేంద్రాన్ని కడిగేసిన కేటీఆర్

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 11:07 AM IST
ఎందుకీ వివక్ష : కేంద్రాన్ని కడిగేసిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. సాగు, తాగు నీటి రంగాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదన్నారు. రాష్ట్రాలపై మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని సీరియస్ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఒక మాదిరిగా, మిగతా రాష్ట్రాలపై మరో విధంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యలను కేంద్రం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినా లాభం లేకపోయిందన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ ప్రజల మధ్యలో డిమాండ్ చేసినా, పలు దఫాలుగా నేరుగా ప్రధానిని కలిసి విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
డిపాజిట్లు కూడా దక్కలేదు:
కేంద్రం వైఖరి కారణంగానే తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదని కేటీఆర్ అన్నారు. బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకుని బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత తమపై ఉందని కేటీఆర్ చెప్పారు. బీజేపీ పెద్దలు మళ్లీ ఇక్కడికి వస్తారు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తారని, అందుకే ప్రజలను అప్రమత్తం చేయడం తమ బాధ్యత అని కేటీఆర్ అన్నారు.