వెదర్ అప్ డేట్ : తేలిక పాటి వర్షాలు పడుతాయి

10TV Telugu News

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ముగిసినా..అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంగా రాష్ట్రంలో 2019, అక్టోబర్ 26వ తేదీ శుక్రవారం, అక్టోబర్ 27వ తేదీ శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

బుధవారం నుంచి గురువారం వరకు అక్కడక్కడ వర్షాలు కురిశాయని, భువనగిరి జిల్లా పోచంపల్లిలో 6 సెంటీమీటర్లు, భువనగిరి, దోమ 5 సెం.మీ, పరిగి, గోవిందరావుపేట 4 సెం.మీ, కరీంనగర్, వెంకటాపురం, హసన్ పర్తి, దేవరకొండ తదితర ప్రాంతాల్లో 3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. వరంగల్ జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. లష్కర్ బజార్‌లోని పెట్రోల్ బంకులోకి నీరు చేరాయి. హన్మకొండ బస్టాండులో వరద పోటెత్తడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 

మరోవైపు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీ ప్రవాహం వచ్చి చేరింది. గంటకు దాదాపు రెండు టీఎంసీల సామర్థ్యం చొప్పున వరద నమోదవుతోంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టుకు 25.94 టీఎంసీల జలాలు వచ్చాయి. ఇదే తీరులో జూరాలకు రోజుకు 20.60 టీఎంసీలు, నాగార్జున సాగర్‌కు 28.50 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాలు వచ్చి చేరుతున్నాయి. 
Read More : కలిసి పోరాడుదాం : ఆర్టీసీ సమ్మె..ఎవరూ భయపడొద్దు – కార్మిక సంఘాలు