లోక్‌సభ సీట్ల కోసం : కాంగ్రెస్‌లో లోకల్‌- నాన్‌ లోకల్‌ ఫైట్‌

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి షురువైంది. రిజర్వుడ్‌ లోక్‌సభ స్థానాల్లో లోకల్‌-నాన్‌లోకల్‌ ఫైట్‌ ప్రారంభమైంది.

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 02:14 PM IST
లోక్‌సభ సీట్ల కోసం : కాంగ్రెస్‌లో లోకల్‌- నాన్‌ లోకల్‌ ఫైట్‌

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి షురువైంది. రిజర్వుడ్‌ లోక్‌సభ స్థానాల్లో లోకల్‌-నాన్‌లోకల్‌ ఫైట్‌ ప్రారంభమైంది.

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి షురువైంది. రిజర్వుడ్‌ లోక్‌సభ స్థానాల్లో లోకల్‌-నాన్‌లోకల్‌ ఫైట్‌ ప్రారంభమైంది. రిజర్వుడ్ లోక్‌సభ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న స్థానికేతరులకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతలు ధర్నాలకు దిగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. రిజర్వుడ్‌ ఎంపీ స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో లోకల్‌-నాన్‌లోకల్‌ ఫైట్‌ ప్రారంభమైంది. లోక్‌సభ సీటు దక్కించుకునేందుకు నేతలు లోకల్‌-నాన్ లోకల్‌ ఫీలింగ్‌ తీసుకువస్తున్నారు. నాన్‌ లోకల్‌ గో బ్యాక్‌ అంటూ నినదిస్తున్నారు. 
 
తెలంగాణలో మొత్తం 17 లోక్‌ స్థానాలుండగా.. ఇందులో ఐదు రిజర్వుడ్‌ లోక్‌సభ సీట్లు ఉన్నాయి.  ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌ ఎస్టీలకు రిజర్వు కాగా… నాగర్‌ కర్నూల్‌, పెద్దపల్లి, వరంగల్‌ సీట్లు ఎస్సీలకు  రిజర్వు అయ్యాయి. వీటిలో పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్‌ స్థానాలకు పోటీ ఎక్కువగా ఉంది. ఒక్కో సీటుకు 15 మందికిపైగా ఆశావహులు పోటీ పడుతున్నారు. రిజర్వుడ్‌ స్థానాల్లో ఏదో ఒక సీటు ఇవ్వకపోతారా.. అన్న ధీమాతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో లోక్‌ల్‌, నాన్‌ లోక్‌ ఫీలింగ్‌ తెరపైకి వచ్చింది. టీపీసీసీ నాయకత్వానికి ఇప్పుడు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోసిన వారికి కాదని స్థానికేతరులకు సీట్లు కట్టబెడతారా.. అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

నాగర్‌ కర్నూల్‌ ఎస్సీ రిజర్వుడ్‌ లోక్‌సభ స్థానంలో లోకల్‌ లొల్లి ఎక్కువగా ఉంది. ఈ స్థానానికి కాంగ్రెస్‌ నాయకత్వం  స్థానికేతరులకు టికెట్లు ఇచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. దివంగత మల్లు అనంతరాములు నుంచి మల్లు రవి, మంద జగన్నాథం, ప్రస్తుత ఎంపీ నంది ఎల్లయ్య వరకు అందరూ నాన్‌ లోకల్‌ నేతలు. దీంతో ఈసారి  నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గానికే చెందిన స్థానిక నేతకు సీటు ఇవ్వాలన్న డిమాండ్‌ పెరిగింది. స్థానికులకే సీటు ఇవ్వాలంటూ కార్యకర్తలు  రోడ్డెక్కారు. ఈ స్థానం కోసం రేసులో చాలా మంది ఉన్నా…  పోటీ మాత్రం ప్రధానంగా నలుగురి మధ్యే ఉంది. వీరిలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, మాదిగ ఉద్యమ నేత సతీష్‌ మాదిగ స్థానికులు కాగా, మల్లు రవి, నంది ఎల్లయ్య స్థానికేతరులు. 

నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా స్థానికుడైన మాజీ మంత్రి రాములుకు సీటు దాదాపు ఖరారైంది. ఇది కాంగ్రెస్‌లో లోకల్‌ పంచాయితీకి మరింత ఆజ్యం పోసింది. ఈ స్థానంలో మాల సామాజిక వర్గం ఓటర్ల  కంటే మాదిగ సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్థానికులైన సంపత్‌కుమార్‌, సతీష్‌ మాదిగ సీటు కోసం పోటీ పడుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాములు మాదిగ సామాజిక వర్గం నాయకుడు కావడంతో..కాంగ్రెస్‌లో కూడా స్థానికుడైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికే సీటు ఇవ్వాలన్న డిమాండ్‌తో కేడర్‌ రోడ్డెక్కింది. దీంతో టీపీసీసీలో కలవరం మొదలైంది. గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ సీటు కోసం జరుగుతున్న లోకల్‌, నాన్‌ లోకల్‌ లొల్లి విజయంపై ప్రభావం చూపుతుందోమోనన్న భయం కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని వేధిస్తోంది. దీంతో స్థానికున్నే అభ్యర్థిగా నిర్ణయిస్తే ఏ సమస్యా ఉండదని అధిష్టానం భావిస్తోంది.