141 నామినేషన్ల తిరస్కరణ : నిజామాబాద్ బరిలో 186 మంది

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 12:47 AM IST
141 నామినేషన్ల తిరస్కరణ : నిజామాబాద్ బరిలో 186 మంది

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 646 మంది నామినేషన్లు వేయగా … వీరిలో 141 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో లోక్‌సభ బరిలో 505 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక ఏపీలో  అసెంబ్లీ బరిలో 2, 581 మంది నిలవగా… లోక్‌సభకు 332 మంది పోటీలో ఉన్నారు. మార్చి 28వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతో జాబితాను ప్రకటించి , గుర్తులు కేటాయిస్తారు.

తెలంగాణలో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. 203 మంది 245 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన పూర్తయిన తర్వాత 191 నామినేషన్లు ఓకే అయ్యాయి. వీరిలో 186 మంది రైతులు ఉన్నారు. 12మంది నామినేషన్లను తిరస్కరించారు. మార్చి 28వ తేదీ గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా అంతేమంది పోటీలో ఉంటే రిటర్నింగ్ అధికారి వాస్తవ పరిస్థితిని ఈసీకి తెలియజేస్తారు. అదే రోజు లేదా మర్నాడు ఎన్నికల సంఘం గుర్తించిన ప్రింటర్లతో అధికారులు సమావేశంకానున్నారు. వారు నిర్ణీత గడువులోగా బ్యాలెట్‌ పేపర్లు ముద్రించగలమని హామీ ఇస్తే..యథావిధిగా ఏప్రిల్ 11నే పోలింగ్‌ జరుగుతుంది. లేదంటే వాయిదాపడే అవకాశం ఉంది.

విజయనగరం జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్దన్‌ థాట్రాజ్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఆయన ఎస్టీ కాదని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో డమ్మీ అభ్యర్థిగా వేసిన థాట్రాజ్‌ తల్లి నరసింహప్రియ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఏర్పడింది. ఇక విశాఖ జిల్లా నర్సీపట్నం జనసేన అభ్యర్థి నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. 

కృష్ణా జిల్లా పెనమలూరు బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌, వైసీపీ అభ్యర్థి కె.పార్థసారథి నామినేషన్లు పెండింగ్‌లో పడ్డాయి. కేసుల వివరాలు దాచిపెట్టారని వీరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. రిటర్నింగ్‌ అధికారి మిషాసింగ్‌ వీరి నామినేషన్లను ఎన్నికల కమిషన్‌ పరిశీలనకు పంపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ అభ్యర్థి రవి సూర్య బీ-ఫామ్‌ ఇవ్వకపోవడంతో నామినేషన్‌ తిరస్కరించారు. పులివెందుల జనసేన అభ్యర్థి చంద్రశేఖర్‌ నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. 

రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు దాఖలైన 3,795 నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు మంగళవారం పరిశీలించారు. వీటిలో 782 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అసెంబ్లీ బరిలో 2,581 మంది, లోక్‌సభ బరిలో 332 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28వ తేదీ గురువారం వరకు గడువుంది. గడువు ముగిశాక అదేరోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల కమిషన్‌ ప్రకటించనుంది.