మీకు తెలుసా : ‘గ్యాసు’కు బీమా

  • Published By: madhu ,Published On : January 21, 2019 / 03:25 AM IST
మీకు తెలుసా : ‘గ్యాసు’కు బీమా

హైదరాబాద్ : ఏదైనా ప్రమాదం జరిగితే బీమా ఉంటుంది కదా. మరి గ్యాస్ ప్రమాదం జరిగితే బీమా ఉంటుందా ? అంటే ఉంటుందండి. ఇది చాలా మందికి తెలియదు. ఇటీవలే గ్యాస్ సిలిండర్ల ప్రమాదాలు చోటు చేసుకుంటూ నిండు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. సిలిండర్‌లో ఏదైనా లోపం వల్ల ప్రమాదం జరిగితే…వినియోగదారులు నష్టపరిహారం కోరవచ్చు. 
ఎల్పీజీ సిలిండర్ ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే రూ. 5 లక్షలు, గాయపడితే వైద్య చికిత్సల కోసం రూ. లక్ష..ఇందులో తక్షణసాయంగా రూ. 25వేలు అందిస్తారు. ఒకవేళ ఆస్తులకు నష్టం కలిగిందనుకొండి..దానికి రూ. లక్ష వరకు పరిహారం పొందే అవకాశాలున్నాయి.
గ్యాస్ ప్రమాదం జరిగితే వినియోగదారుడు బీమా కంపెనికి తెలియచేయాల్సినవసరం లేదు. కేవలం సంబంధిత పంపిణీదారుడికి విషయం తెలియచేయాలి. వారు వచ్చి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటారు. అనంతరం ఈ విషయాన్ని సదరు కంపెనీ ప్రతినిధులకు తెలియచేస్తారు. బీమా కంపెనీ పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుంది. అనంతరం పరిహారాన్ని సంబంధిత ఆయిల్ కంపెనీకి చెల్లిస్తుంది. కంపెనీ ప్రతినిధి నష్టపోయిన వినియోగదారులకు పరిహారం మొత్తాన్ని అందచేస్తారు. 
ఇక్కడ పలు నిబంధనలు అమలు చేస్తారు. బీమా ఒప్పందం మేరకు ఎలాంటి నియమాలున్నాయో వాటికే పరిహారం చెల్లిస్తారు. గ్యాస్ తీసుకున్న సమయంలో ఇచ్చిన అడ్రస్‌లో ఉన్న ఆస్తులకు మాత్రమే పరిహారం లభిస్తుంది. గ్యాస్ సిలిండర్‌లో లోపాలుంటేనే పరిహారం అందచేస్తారు. ఆత్మహత్యలు, డ్రగ్స్ ప్రభావం వల్ల సంభవించిన ప్రమాదాలు, తుపాన్, ప్రకృతి విపత్తు వల్ల, భూంకంపాలు, వరదలు..గ్యాస్ ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం ఇవ్వరు. 
 

Read More : సిలిండర్ అలర్ట్ : డెలివరీ సమయంలో ఇలా చెక్ చేయండి