తెలంగాణ తొలి కరోనా బాధితుడితో ఫోన్ లో మాట్లాడిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2020 / 09:29 AM IST
తెలంగాణ తొలి కరోనా బాధితుడితో ఫోన్ లో మాట్లాడిన మోడీ

ప్రతినెలా చివరి ఆదివారం దేశప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదివారం(మార్చి-29,2020)మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మోడీ ప్రత్యేకంగా…ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19పై మాట్లాడారు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ విధించడం, ప్రజలు సామాజిక దూరం పాటించాల్సిన అవసరం, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సేవలను ప్రధాని మన్‌ కీ బాత్‌ లో ప్రసంగించారు.

ఈ క్రమంలో భాగంగా తెలంగాణ‌కు చెందిన తొలి క‌రోనా బాధితుడు,ఐటీ ఉద్యోగి అయిన రామ్ తేజతో మాట్లాడారు. కరోనా భారిన పడి గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన హైదరాబాద్‌కు చెందిన రామ్ తేజను ఇప్పుడు ఎలా ఉంది అని మోడీ ఫోన్ లో అడిగారు. కరోనా ఎఫెక్ట్ కాగానే ఎలా ఫీల్ అయ్యావు,వెంటనే ఏం చేశావ్ అని మోడీ రామ్ తేజను అడిగారు. 

రామ్‌ స్పందిస్తూ.. దుబాయ్‌ నుంచి తిరిగిరాగానే జ్వరంగా అనిపించింది. దీంతో వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లాను. ఆ తర్వాత కొంచెం ఆరోగ్య ఇబ్బందులు ఎక్కువడంతో మార్చి-2,2020న గాంధీ హాస్పిటల్ కు వెళ్లాను. వెంటనే పరీక్షలు చేయించుకున్నాను. కోవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది. క‌రోనా రాగానే మొద‌ట్లో చాలా భ‌య‌ప‌డ్డాను. మొదటి రెండు రోజులు ఆస్పత్రిలో టెన్షన్ పడ్డాను.. ఆత‌ర్వాత డాక్ట‌ర్లు, వైద్య‌ సిబ్బంది నాలో భ‌రోసా నింపిన‌ట్లు తెలిపాడు.

డిశ్చార్జి అయిన తర్వాత కూడా క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపాడు. ఇంటికెళ్లాక కొన్నాళ్లు ఎవరినీ కలవవద్దని డాక్టర్లు చెప్పారని తెలిపాడు. ఇంటికెళ్లిన తర్వాత 6మీటర్లు దూరంగా ఉన్నట్లు చెప్పాడు. తన కుటుంబ సభ్యులను కూడా పరీక్షలు చేయించుకోమ్మని చెప్పినట్లు రామ్ మోడీకి తెలిపాడు. ఇప్పటికి తన చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటున్నట్లు చెప్పాడు.

దీనిపై ప్రధాని స్పందిస్తూ… ఈ క్లిష్ట సమయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు ఎంతో ముఖ్యమన్నారు. ఈ లాక్‌డౌన్‌ మిమ్మల్ని, మీ కుటుంబాలను సురక్షింతంగా ఉంచుతుందని తెలిపారు. అందరం కలిసి కోవిడ్‌-19ను ఓడిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. డిశ్చార్జి అనంత‌రం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపాడు. యువకుడి అనుభవాల పై సెల్ఫీ వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారుల‌ను మోడీ కోరారు.

ఆగ్రాకు చెందిన కరోనా బాధితుడు,హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అశోక్ కపూర్ అనే వ్యక్తితో కూడా ఈ సందర్భంగా మోడీ ఫోన్ లో మాట్లాడారు. తాను ఇటలీలో వ్యాపారం చేస్తుండేవాడినని,  ఇటీవల ఇటలీ నుంచి భారత్ కు తిరిగి వచ్చినట్లు అశోక్ కూర్ మోడీకి తెలిపారు. తన కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అశోక్ కపూర్ తెలిపారు. తన కుటుంబం మొత్తానికి ఇప్పుడు నయమైపోయినట్లు అశోక్ కపూర్ మోడీకి తెలిపారు. తాము గడప దాటి బయటకు వెళ్లడం లేదని అశోక్ కపూర్ మోడీకి చెప్పాడు. స్పందించిన మోడీ…. అశోక్ కపూర్ తన,తన కుటుంబసభ్యులను అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయాలని కోరారు.