మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పై కేసీఆర్ రివ్యూ 

  • Published By: chvmurthy ,Published On : May 3, 2019 / 01:39 PM IST
మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పై కేసీఆర్ రివ్యూ 

హైదరాబాద్: మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్ట్ ప‌నుల‌ను వ‌చ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాల‌ని  సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పున‌రావ‌సం, స‌హాయ చ‌ర్య‌ల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పంపిణీ చేయాల‌ని కూడా సీఎం ఆదేశించారు.  శుక్రవారం ఆయన మల్లన్న సాగర్ జలాశయం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్ర‌త్యేకంగా  అధికారుల నియామ‌కం జ‌రిపి పున‌రావ‌స చ‌ర్య‌లు చేప‌ట్టాలన్నారు. తెలంగాణ లో 40 ల‌క్ష‌ల‌కు పైగా ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి సాగునీటిని అందించేందుకు  నిర్మాణం చేస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు నిర్మాణం చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే మ‌ల్ల‌న్న సాగ‌ర్ నిర్మాణం కోసం బ్రేకులు ప‌డుతూనే వ‌స్తున్నాయి.

భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. కానీ కొందరు కోర్టుల‌కు వెళ్ల‌డంతో అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగ‌క‌ పోవ‌డంపై ముఖ్య‌మంత్రి కేసిఆర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. నిర్వాసితుల‌కు న‌ష్ట ప‌రిహారాన్ని వారం రోజుల్లో అందించాల‌ని ఆదేశించారు. రాజ‌కీయ కోణంలో ప్రాజెక్టు ప‌నులు ముందుకు సాగ‌కుండా కొన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌య‌త్నించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.  ప్ర‌త్యేక అధికారుల స‌మక్షంలో శ‌నివారం నుంచి చెక్కుల పంపిణీ మొద‌లు కానుంది. ఎవ‌రైనా నిర్వాసితులు చెక్కులు తీసుకునేందుకు ఆస‌క్తి చూప‌క పోతే వారి అభిప్రాయాన్ని రికార్డు చేయాల‌ని  ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది.