నిఘాలో హైదరాబాద్ : గణేష్ నిమజ్జనానికి కేంద్ర బలగాలు

  • Edited By: veegamteam , September 4, 2019 / 04:34 AM IST
నిఘాలో హైదరాబాద్ : గణేష్ నిమజ్జనానికి కేంద్ర బలగాలు

హైదరాబాద్ లో వినాయక చవితి సందడి మొదలైంది. బుధవారం (సెప్టెంబర్ 4, 2019) నుంచి నిమజ్జనం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 12న జరిగే ప్రధాన నిమజ్జనంతో ఉత్సవం ముగుస్తుంది. ఈక్రమంలో నగర పోలీస్ విభాగం అప్రమత్తమైంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా సీపీ కెమెరాలతో నిఘా, రూఫ్ టాప్ వాచ్, ఎక్కడికక్కడ కార్డన్ ఏరియాలు, నగర వ్యాప్తంగా 250 ప్రాంతాల్లో వాచ్ టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కమ్యూనల్, సాధారణ రౌడీషీటర్ల బైండోవర్ ప్రక్రియ పూర్తి కావచ్చింది. 

అవసరమైన చోట్ల, అనుమానిత ప్రాంతాల్లో సాయుధ బలగాలు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నాయి. మూడు కమిషనరేట్లలోని సిబ్బంది అందరికీ స్టాండ్ టు ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను బట్టి ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్ లో ఉంచారు. కమిషనరేట్లలో ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోని సిబ్బంది, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు, పొరుగు జిల్లాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ భద్రత, బందోబస్తు చర్యల్లో అవసరమైన మార్పు చేర్పులు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలతోపాటు కీలక మండపాలను ప్రతిరోజు బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీ చేయనున్నాయి.

మండపాల దగ్గర ఉండే వాలంటీర్లకు అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులను గుర్తించడంపై స్థానిక పోలీసుల ద్వారా ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సెప్టెంబర్ 10 వ తేదీన మొహర్రం కావడంతో బీబీకా ఆలం ఊరేగింపు సైతం జరుగనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిపి 62 వేల మండపాలు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రానికి నగర పోలీస్ అధికారిక వెబ్ సైట్ ద్వారా 10 వేల 702 మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారు. ఇవన్నీ ఐదడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తైనవి కావడం గమనార్హం. అంతకు తక్కువ ఎత్తుతో కూడిన వాటిని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో సాధారణంగా అనుమతి తీసుకోవట్లేదు.

కీలక నిమజ్జనాలు జరిగే హుస్సేన్ సాగర్, ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏర్పాట్లను మధ్య మండల సంయుక్త పోలీస్ కమిషనర్ ఎన్.విశ్వప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక అధికారిగా స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది సాగర్ లో 25 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. మూడో రోజైన బుధవారం (సెప్టెంబర్ 4, 2019) నుంచి ఈ సందడి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఐదు, ఏడు, తొమ్మిదో రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఈలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి సిబ్బంది, క్రేన్లు అక్కడే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రతి క్రేన్ దగ్గర నిమజ్జనం అవుతున్న విగ్రహాల వివరాలు, సమయాలు తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం అవలంభిస్తున్నారు. భవిష్యత్ లో జరిగే ఈ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఇది ఉపకరిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. పటిష్ట నిఘా, బందోబస్తు కోసం గతేడాది మాదిరే వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ దగ్గర కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

పోలీసుల సూచనలు:

* మండపం దగ్గర నిర్వాహకులు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. వారి ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలపై నిఘా వేసి ఉంచాలి. 
* గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే వస్తువులను తీసుకోకూడదు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనేది గమనిస్తుండాలి. 
* పార్కింగ్ ప్రాంతాలు, అక్కడ నిలిపి ఉంటున్న వాహనాలపైనా కన్నేసి ఉంచాలి. 
* రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు వాడకూడదు. 
* మండపం పైనుంచి వెళ్లే విద్యుత్ తీగలు, హైటెన్షన్ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 
* అక్రమ విద్యుత్ కనెక్షన్లు నేరమే కాదు.. ప్రమాదం కూడా అనేది గుర్తుంచుకోవాలి. 
* రాత్రి వేళ మండపంలో ఎవరో ఒకరు కాపలా ఉండడం ఉత్తమం. 
* మండపం దాదాపుగా మండే స్వభావం ఉన్న థర్మకోల్, చెక్క తదితర వస్తువులతో నిర్మితమవుతుంది. ఈక్రమంలో * అక్కడ వెలిగించే దీపాలు, అగరబత్తీలు, హారతి కర్పూరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 
* ఎలాంటి పుకార్లను నమ్మకూడదు. అవి విస్తరించేలా, ప్రచారం చేసేలా ప్రవర్తించడం నేరం. 
* ఇతరుల మనోభావాలు దెబ్బతినే, రెచ్చగొట్టేలా చేసే చర్యలు, వ్యాఖ్యలు ఉండకూడదు.