అయ్య బాబోయ్ ఎండలు : హైదరాబాద్‌లో @ 40.2 డిగ్రీలు

  • Published By: madhu ,Published On : March 31, 2019 / 01:06 AM IST
అయ్య బాబోయ్ ఎండలు : హైదరాబాద్‌లో @ 40.2 డిగ్రీలు

అమ్మ బాబోయ్ ఎండలు అంటున్నారు ప్రజలు. బయటకు వెళితే సుర్రుమని వాత పెడుతానంటున్నాడు సూర్యుడు. ఓ వైపు ఎండలు..మరోవైపు ఉక్కపోతతో అప్పుడే ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి వేళ్లల్లో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 2.5 డిగ్రీలకుపైగా టెంపరేచర్స్ పెరిగాయి. మార్చి 30వ తేదీ శనివారం ఎండ వేడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో గరిష్టంగా 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సాధారణం కన్నా 2.5 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ రికార్డయినట్లు వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు.

అత్యధికంగా ఖమ్మంలో సాధారణం కన్నా 3.9 డిగ్రీలు పెరిగి 40.2 డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో 3.5 డిగ్రీలు పెరిగి 41.2, హైదరాబాద్‌లో 3.3 డిగ్రీలు పెరిగి 40.2, నిజామాబాద్‌లో 3 డిగ్రీలు పెరిగి 41.5, భద్రాచలంలో 2.9 డిగ్రీలు పెరిగి 41.2, మహబూబ్ నగర్‌లో 2.8 డిగ్రీలు పెరిగి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో మార్చి 31వ తేదీ ఆదివారం, ఏప్రిల్ 01వ తేదీ సోమవారాల్లో ఎండ తీవ్రత అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.