ఆర్టీసీ నష్టాలకు ఒలెక్ట్రా కారణం కాదు – మేఘా

ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా... కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు

  • Published By: veegamteam ,Published On : October 15, 2019 / 07:54 AM IST
ఆర్టీసీ నష్టాలకు ఒలెక్ట్రా కారణం కాదు – మేఘా

ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా… కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు

ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా… కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు ఇచ్చిందని ప్రకటించింది. ఆర్టీసీలో 2 వేలకు పైగా అద్దె బస్సులు ఉండగా.. అందులో కేవలం 40 ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తమవంటూ తెలిపింది. ఈ బస్సుల కారణంగానే ఆర్టీసీకి నష్టాలు వచ్చాయంటూ సాగుతున్న దుష్ప్రచారం సరికాదంది. ఆర్టీసీకి.. ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు ఇవ్వడం వెనుక జరిగిన సంఘటనలపై స్పష్టత ఇచ్చింది మేఘా.

అద్దె బస్సుల వల్లే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయా? వాస్తవ పరిస్థితుల్ని చూస్తే.. ఇలాంటి ఆరోపణల్లో ఎలాంటి అర్థం లేదని స్పష్టంగా తెలుస్తుంది. 3 దశాబ్దాలుగా అద్దె బస్సులు తీసుకుని ఆర్టీసీ నడుపుతోంది. తెలంగాణ ఆర్టీసీ ఏడాదికి రూ.1200 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న డీజిల్ ధరలు. ఇంధన ధరల్లో సబ్సిడీ లేకపోవడంతో పాటు రూ.5 వేల కోట్ల రుణభారం కూడా ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేసింది. ఇలాంటి వాస్తవాలను మరుగునపెట్టి… ఆర్టీసీ నష్టాల్ని మేఘా మెడకు చుట్టే ప్రయత్నాలు సాగుతున్నాయంటూ ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

అసలు ఒలెక్ట్రా సంస్థ బస్సుల్ని లీజుకు సమకూర్చలేదు. అంతకుముందున్న గోల్డ్‌స్టోన్‌ సంస్థ వాటిని టీఎస్ ఆర్టీసీకి లీజుకు ఇచ్చింది. ఆ తర్వాత గోల్డ్‌స్టోన్‌ సంస్థలోని అత్యధిక వాటాను మేఘా ఇంజనీరింగ్ కొనుగోలు చేయడంతో… ఒలెక్ట్రాగా పేరు మారింది. ఇది లిస్టెడ్ సంస్థ. ఇందులో చాలామంది పెట్టుబడిదారులు ఉన్నారు. పూర్తిగా మేఘా సంస్థకు సంబంధించింది కాదంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. ఆర్టీసీకి చెందాల్సిన నిధుల్ని ఒలెక్ట్రా సంస్థకు కట్టబెట్టారన్న అడ్డగోలు ఆరోపణలపై కూడా మేఘా సంస్థ స్పందించింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం కేంద్రం ఈ నిధుల్ని టీఎస్ ఆర్టీసీకి విడుదల చేసింది.

టీఎస్ ఆర్టీసీ ఏదో ఒక సంస్థ నుంచి వాటిని సమకూర్చుకోవాలి. అందులో భాగంగా గోల్డ్‌స్టోన్‌ నుంచి అప్పట్లో లీజుకు సేకరించింది. సరఫరా చేసిన సంస్థకు లీజు ఒప్పందం ప్రకారం కిలోమీటర్‌కు ఇంత చొప్పున చెల్లించాలి. ఇక్కడా అదే జరుగుతోంది. బస్సులు లీజుకు ఇచ్చినందుకు టీఎస్ ఆర్టీసీ లీజు ధర చెల్లించక తప్పదు. డీజిల్‌ బస్సులకు చెల్లించినట్లే… ఎలక్ట్రిక్‌ బస్సులకు కూడా ఆర్టీసీ కిలోమీటర్ల లెక్కన ఛార్జీలను చెల్లిస్తోంది. అంతమాత్రాన ఆర్టీసీకి చెందాల్సిన డబ్బు ప్రైవేటుకు వెళ్లిపోయిందని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నిస్తున్నారు మేఘా ప్రతినిధులు. పైగా.. ఒప్పందం ప్రకారం ఒలెక్ట్రాకు చెల్లించాల్సిన బిల్లులను కూడా ఆర్టీసీ నిధులు లేవంటూ పెడింగ్‌లో పెట్టింది. అయినప్పటికీ బస్సులను నడిపిస్తున్నామంటున్నారు ఒలెక్ట్రా ప్రతినిధులు.

ఒలెక్ట్రా కంపెనీ నుంచి తీసుకున్న 40 బస్సుల వల్లే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలొస్తున్నాయని చాలామంది గుడ్డిగా ఆరోపిస్తున్నారు. నిజానికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనే లేదు. కేవలం అద్దె ప్రాతిపదికనే బస్సులు తీసుకుని నడిపిస్తోంది. ఈ 40 బస్సులకు కేంద్రం ఇచ్చేది కేవలం రూ.20 కోట్లు మాత్రమే. అంటే బస్సుకు కేవలం 50 లక్షలు సబ్సిడీ ఇచ్చింది. మిగతా డబ్బు పెట్టే సామర్థ్యం లేకపోవడంతో… కేవలం అద్దెకు తీసుకుని నడపాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఈ బస్సులను ఒలెక్ట్రా సమకూర్చింది. దీనికే.. మేఘా కంపెనీ రూ.3వేల 500 కోట్లు స్వాహా చేశారంటూ ప్రచారం చేయడాన్ని ఆ సంస్థ ఖండిస్తోంది. వాస్తవాలు తెలుసుకోకుండా.. ఇలాంటి ప్రచారం చేయవద్దంటూ హెచ్చరించింది.

ఎలక్ట్రిక్ బస్సుల లీజు విషయంలో కేంద్రం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆర్టీసీ పనిచేస్తోందే కానీ… సీఎం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు కాదు. అదే విధంగా అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం ఆదేశాల ప్రకారమే బస్సులను లీజుకు తీసుకుంటున్నాయి. ఇది కొత్తగా తెలంగాణాలో వచ్చింది కాదు. ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ వివరాలన్నీ తెలియకుండానే చాలామంది అడ్డగోలు ఆరోపణలు కురిపిస్తున్నారని మేఘా యాజమాన్యం మండిపడింది.