గుడ్ న్యూస్ : దీపావళిలోపే రాయదుర్గం వరకు మెట్రో 

  • Published By: veegamteam ,Published On : September 29, 2019 / 05:04 AM IST
గుడ్ న్యూస్ : దీపావళిలోపే రాయదుర్గం వరకు మెట్రో 

రాయదుర్గానికి మెట్రో రైల్ సర్వీస్ అతిత్వరలో అందుబాటులోకి రానుంది. దీపావళి పండుగకు ముందే హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం ప్రాంతానికి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. కిలోమీటర్ కు పైగా ఉండే ఈ మార్గంలో మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ఈ పనులకు సంబంధించి మెట్రో అధికారి పరిశీలించారు. 

ఇప్పటికే కారిడార్- 3లో నాగోల్ నుంచి హైటెక్‌సిటీవరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, త్వరలో రాయదుర్గంవరకు నడుపనున్నారు. డిసెంబర్‌లో కారిడార్-2లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాన్ని ప్రారంభిస్తారు. ప్రస్తు తం మూడు కారిడార్ల కోసం 56 రైళ్లు ఉండగా, 45 రైళ్లు మెట్రో కారిడార్-1, 3లలో 800 ట్రిప్పులు నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గతంలో 15 నిమిషాలకో రైలు నడువగా, ప్రస్తుతం 5 నిమిషాలకు కుదించారు.

హైటెక్‌సిటీ రివర్సల్ అందుబాటులోకి వచ్చాక ఫ్రీక్వెన్సీ పెంచి 5 నిమిషాలకో రైలు నడిపిస్తున్నారు. దీన్ని మూడు నిమిషాలకు తగ్గించనున్నారు. మూడు కారిడార్లలో రైళ్ల రాకపోకలు ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య ప్రారంభమై 5 లక్షల నుంచి 10 లక్షలకు చేరుకొంటుందని అంచనా. హైదరాబాద్ మెట్రోకే సొంతమైన సీబీటీసీ టెక్నాలజీ ద్వారా 90 సెకన్లకో రైలు నడిపించవచ్చని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.