మౌనిక మరణం మరువకముందే: పగిలిన గోడలు.. భయపెడుతున్న మెట్రో

  • Published By: vamsi ,Published On : October 11, 2019 / 02:13 AM IST
మౌనిక మరణం మరువకముందే: పగిలిన గోడలు.. భయపెడుతున్న మెట్రో

మెట్రో వచ్చిందని సంబరపడ్డారు.. ట్రాఫిక్ ఇబ్బందులు తీరాయని ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ మెట్రో కట్టడాన్ని చూస్తుంటే మాత్రం భయపడుతున్నారు హైదరాబాద్ నగరవాసులు. ప్రతిష్టాత్మకంగా నగరంలో ఎంతో ఆర్భాటంగా వాడుకలోకి తీసుకుని వచ్చిన మెట్రో.. మేలు చేయడం కంటే కీడు ఎక్కువ చేస్తుందనే భయం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏ మెట్రో పెచ్చులు ఊడుతుందా? అని పైకి చూస్తూ నడిచే పరిస్థితిలో ఉంది మెట్రో నిర్మాణం.

నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో గోడల మీద ఏర్పడిన పగుళ్లే ఇందుకు సాక్షాలు. ఇటీవల అమీర్ పేట మెట్రోస్టేషన్ కింద మౌనిక అనే మహిళపై మెట్రో పెచ్చులూడిపడడంతో ఆమె చనిపోయింది. ఈ ఘటనను మరువముందే బేగంపేట సమీపంలోని ప్రకాశ్ నగర్ మెట్రోస్టేషన్ గోడపై ఏర్పడిన పగుళ్లను ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. అంతేకాదు ఇంకా నగరంలోని అనేకచోట్లు వానపడితే చాలు ఇటువంటివి చాలా కనిపిస్తున్నాయి.

హైదరాబాద్ లో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చి రెండేళ్లు కూడా ఇంకా గడవలేదు. అయితే మెట్రో స్టేషన్ల గోడలపై మాత్రం పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పగుళ్లే ఇప్పుడు హైదరాబాద్ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద మౌనిక అనే మహిళ చనిపోగా.. తర్వాత హడావుడి చేసిన అధికారులు.. మిగిలిన స్టేషన్లలో అయినా ముందే స్పందిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని స్టేషన్లను అధికారులు తనిఖీ చేసి లోపాలు ఉంటే సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశ్ నగర్ మెట్రోస్టేషన్లో గోడకు ఏర్పడిన పగుళ్లు మెట్రో కట్టడం నాణ్యత లోపమే అని అంటున్నారు. ప్రకాశ్ నగర్ స్టేషన్లో ఏర్పడిన పగుళ్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవగా మెట్రో సిబ్బంది మరమ్మతులు చేపట్టినా.. ప్రమాదం జరగకముందే అధికారులు అన్నిచోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.