పంచాంగ శ్రవణం..రాములోరి కళ్యాణం లైవ్ లోనే చూడండి : ఇంద్రకరణ్ రెడ్డి

  • Published By: chvmurthy ,Published On : March 21, 2020 / 12:35 PM IST
పంచాంగ శ్రవణం..రాములోరి కళ్యాణం లైవ్ లోనే చూడండి : ఇంద్రకరణ్ రెడ్డి

ప్రతి ఏటా ఉగాది రోజు ప్రభుత్వం నిర్వహించే పంచాంగ శ్రవణం వేడుక‌ల‌ను… ఈ ఏడాది  ప్రజలు లైవ్ టెలికాస్ట్ లో చూడాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కోరారు.  ఉగాది వేడుకలను ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌డం అనాదిగా వ‌స్తోంద‌ని, అయితే ప్రాణాంత‌క క‌రోన వైర‌స్ క‌ట్ట‌డి ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుక‌ల‌ను నిరాడంబ‌రంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు  మంత్రి తెలిపారు.

భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు కూడా భక్తులను  అనుమ‌తించటంలేద‌న్నారు. ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం, శ్రీరామన‌వ‌మి వేడుక‌లు, ఆల‌యాల్లో ద‌ర్శ‌నాల ర‌ద్దుపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శ‌నివారం దేవాదాయ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌భుత్వ సల‌హాదారు కేవీ. ర‌మ‌ణాచారితో క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా  సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో  రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాల్లో సామాన్య భక్తులకు ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేశామ‌ని మంత్రి తెలిపారు.

ఈ నెల 25 ఉగాది వేడుకలను దేవాదాయశాఖ కార్యాలయంలోనే  ఉదయం 10 గంటలకు పంచాంగ శ్ర‌వ‌ణంతో ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి లైవ్ ద్వారా టీవీల్లో ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణాన్ని వీక్షించాలని కోరారు. భద్రాద్రిలో యథావిధిగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తామ‌ని, కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే శ్రీరామ నవమి వేడుకలు జ‌రుగుతాయ‌న్నారు. బహిరంగ వేడుకలు నిర్వహించొద్దని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వం త‌ర‌పున యధావిధిగా స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, త‌లంబ్రాలు స‌మ‌ర్పిస్తామ‌ని చెప్పారు. ఈసారి కల్యాణ ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించలేదన్నారు. 
 

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా భక్తులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని మంత్రి  భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి డోర్ డెలీవ‌రి ద్వారా శ్రీసీతారాముల స్వామివారి కళ్యాణం తలంబ్రాలు పంపిస్తామ‌ని చెప్పారు. మ‌రోవైపు క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు దేవాదాయ శాఖ ఆద్వ‌ర్యంలో సుద‌ర్శ‌న‌, మృత్యుంజ‌య‌ హోమాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస‌రావు, జాయింట్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి, త‌దిత‌రులు పాల్గొన్నారు.