దావోస్‌లో ముగిసిన కేటీఆర్ పర్యటన: పోటీలో పెట్టుబడులు రాబట్టిన తెలంగాణ ప్రభుత్వం

  • Published By: vamsi ,Published On : January 24, 2020 / 12:41 PM IST
దావోస్‌లో ముగిసిన కేటీఆర్ పర్యటన:  పోటీలో పెట్టుబడులు రాబట్టిన తెలంగాణ ప్రభుత్వం

నాలుగు రోజుల పాటు దావోస్‌లో పెట్టుబడుల కోసం పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తన పర్యటన ముగించుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం నాల్రోజుల పాటు.. దావోస్‌లో కేటీఆర్‌ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల అధిపతులు, వివిధ దేశాల ప్రతినిధులతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. దావోస్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. సుమారు 50కి పైగా సమావేశాలతో పాటు ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన ఐదు చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

దావోస్‌లో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా పర్యటించారు మంత్రి కేటీఆర్. ఈ పర్యటనలో సుమారు 50కి పైగా కంపెనీలతో సమావేశం అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఐదు చర్చా కార్యక్రమాల్లో ఆల్ఫాబెట్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోక-కోల సీఈవో జేమ్స్ క్వేన్సీ, సేల్స్ ఫోర్స్ స్థాపకుడు చైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వోజ్సికి లాంటి కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతిశీల విధానాలతో పాటు ఇండస్ట్రీయల్ పాలసీని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను, వివిధ పరిశ్రమలకు ఇక్కడ అందుబాటులో ఉన్న వనరులను పరిచయం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో అగ్రస్థానంలో నిలుస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుని మంత్రి కేటీఆర్.. వివిధ దేశాల ప్రతినిధులకు వివరించారు.

దావోస్ పర్యటన ద్వారా పిరమల్ గ్రూప్‌కు సంబంధించిన రూ. 500కోట్ల పెట్టుబడితో పాటు అనేక ఇతర కంపెనీలు తెలంగాణ పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా… దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం నుంచి మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు.