TSRTC సమ్మెపై సెటైర్లు : దమ్ముంటే అక్కడ విలీనం చేయండి – తలసాని

  • Published By: madhu ,Published On : October 13, 2019 / 01:56 AM IST
TSRTC సమ్మెపై సెటైర్లు : దమ్ముంటే అక్కడ విలీనం చేయండి – తలసాని

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న గులాబీ దళం ఇప్పుడు సై అంటోంది. ఆర్టీసీ జేఏసీకి, విపక్షాలకు గులాబీ పార్టీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. ఆర్టీసీ కార్మికులు మానవతా దృక్పథంతో వ్యవహరించలేదని.. కీలక సమయంలో సమ్మెకు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇవ్వలేదని ఎదురుదాడి మొదలు పెట్టారు మంత్రులు. వారం రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ సమ్మెను కార్మికులు రాజకీయ పార్టీల మద్దతుతో ఉధృతం చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు కూడా అప్రమత్తం అవుతున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సమయం ఇచ్చినా.. విలీనం డిమాండ్‌తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని వాదిస్తున్నారు గులాబీ నేతలు. సమ్మె మొదలైన నాటి నుంచి అధికార పక్షం నేతలు సమ్మెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా అమాత్యులంతా రంగంలోకి దిగారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఘాటుగా సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు. దమ్ముంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేసి.. తర్వాత ఇక్కడ డిమాండ్ చేయాలని మంత్రి తలసాని సవాల్ విసిరారు. తెలంగాణలో ఎంతో కీలకమైన బతుకమ్మ, దసరా పండుగ సందర్భాల్లో కార్మికుల సమ్మెకు కుట్రతోనే వెళ్లారని మండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆర్టీసీ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఉన్న అవగాహనతో సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి వారిని ఆదుకున్నారని చెబుతున్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని రద్దు చేసిందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆర్టీసీని ఆదుకునేందుకు మూడు వేల కోట్ల రూపాయలు అందించామన్నారు. మరోవైపు ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం జరిగే పరిణామాలను పరిశీలిస్తామని అంటున్నారు మంత్రులు. మొత్తానికి ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న గులాబీ నేతలు.. ఇప్పుడు స్వరం పెంచారు. విపక్ష నేతల విమర్శలకు కౌంటర్‌ అటాక్‌ ఇస్తున్నారు.
Read More : ఆర్టీసీ సమ్మె 9వ రోజు : ఇబ్బందులు పడుతున్న ప్రజలు