లోకో పైలట్ చంద్రశేఖర్‌ మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్‌ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు. 

  • Published By: veegamteam ,Published On : November 17, 2019 / 02:19 AM IST
లోకో పైలట్ చంద్రశేఖర్‌ మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్‌ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు. 

హైదరాబాద్ కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ MMTS లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతి చెందాడు. రైల్‌ ఇంజిన్‌లో నలిగిపోయి 8 గంటలు.. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఆరు రోజులు మృత్యువుతో పోరాడిన చంద్రశేఖర్‌ మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాత చంద్రశేఖర్‌ను బయటికి తీయడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఐతే.. చంద్రశేఖర్‌ మృతితో రెస్క్యూ సిబ్బందితోపాటు వైద్యుల శ్రమ కూడా వృథా అయింది. 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్‌ చంద్రశేఖర్‌  2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో నివాసముంటున్నాడు. హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ మెకానిక్‌ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య సలై, మూడేళ్ల కుమారుడు ఇమ్మాన్యుయెల్‌ రాజ్‌ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే మరో బాబు పుట్టాడు. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్లాడు. కానీ.. మళ్లీ విగతజీవిగా తిరిగొచ్చాడు. 

రైలు ప్రమాదం గురించి తెలియగానే చంద్రశేఖర్‌ కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. ఐతే.. 8 గంటలపాటు రైల్‌ ఇంజిన్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించిన చంద్రశేఖర్‌ను.. రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో బయటకు తీయడంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. తమ కొడుకు ప్రాణాలను కాపాడాలని దేవుడిని ప్రార్థించారు. కానీ.. వారి ప్రార్థనలు ఫలించలేదు. ఆరు రోజులు మృత్యువుతో పోరాడిన చంద్రశేఖర్‌ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచాడు. కుటుంబసభ్యులకు తీరని ఆవేదన మిగిల్చాడు. చంద్రశేఖర్‌ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు. 

మరోవైపు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లు.. చంద్రశేఖర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే.. అతనిపై ఆర్‌పీఎఫ్, స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.