డిసెంబర్ 4 నుంచి మూవీ థియేటర్లు రీఓపెన్

  • Published By: sreehari ,Published On : December 2, 2020 / 10:32 AM IST
డిసెంబర్ 4 నుంచి మూవీ థియేటర్లు రీఓపెన్

Movie theaters set to open in Hyderabad: నిరీక్షణ ముగిసింది.. హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం (డిసెంబర్ 4) నుంచి మూవీ థియేటర్లు తిరిగి తెరచుకోనున్నాయి. సినిమా థియేటర్లు మూతపడటంతో గత ఎనిమిది నెలలుగా సినీరంగంపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్ మహమ్మారీ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అప్పటి నుంచి మూవీ థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా అని సినీ ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా ఆ సమయం వచ్చేసింది. డిసెంబర్ 4 నుంచి మల్టీప్లెక్స్ థియేటర్లు రీఓపెన్ కాబోతున్నాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న క్రిస్టోఫర్ నోలన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘టెనెట్’ మూవీ ముందుగా సిల్వర్ స్ర్కిన్లపై రానుంది.



ఈ మూవీ నగరంలోని మల్టీఫ్లెక్స్, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు థియేటర్ యాజమాన్యాలు తెలిపాయి. కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూ సినిమా థియేటర్లు తెరుచు కోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతినిచ్చింది. అప్పటినుంచి సినిమా థియేటర్ యాజమాన్యాలు అందుకు తగిన ఏర్పాట్లతో థియేటర్లను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. మల్టీఫ్లెక్స్ చైన్‌లో పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్, సినీపోల్స్, మహేశ్ బాబు AMB సినిమాస్‌లో శుక్రవారం నుంచి సినిమాలు సిల్వర్ స్ర్కిన్లపై ప్లే కానున్నాయి.



అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, OTT ప్లాట్ ఫాంలపై రిలీజ్ అయిన సినిమాలను ప్రారంభంలో ప్లే చేయాలని తెలంగాణ ఎగ్జిబ్యూటర్లు ప్లాన్ చేసినప్పటికీ ఈ ప్లాట్ ఫారంలు అనుమతించలేదు. 80 శాతం మల్టీఫ్లెక్సులు, అనేక సింగిల్ స్ర్కిన్ థియేటర్లు తెరచుకోనున్నాయని తెలంగాణ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ సెక్రటరీ విజేందర్ రెడ్డి తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం. సినిమా థియేటర్లు, మల్టీఫెక్సులు అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీటింగ్ కెపాసిటీతో తెరుచుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో మొత్తం 70 మల్టీఫ్లెక్సులతో కలిపి 175 మూవీ స్ర్కీన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా సినిమా థియేటర్లలో సీటింగ్ కెపాసిటీ 400 నుంచి 1,300 వరకు ఉన్నాయి.