మొదటి రోజే నిందితులకు జైలులో మటన్

  • Published By: vamsi ,Published On : December 2, 2019 / 04:57 AM IST
మొదటి రోజే నిందితులకు జైలులో మటన్

దేశమంతా దిశాకు న్యాయం చెయ్యాలంటూ.. నిందితులకు ఉరే సరి అంటూ నినాదాలతో హోరెత్తుతుంది. శంషాబాద్‌లో అత్యంత కిరాతకంగా హత్యాచారం చేసిన వెటర్నరీ డాక్టర్‌ నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట చెన్నకేశవులులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. చర్లపల్లి జైల్లో ఉన్న వీరిని  వేర్వేరు చీకటి గదులలో బందించారు. వీరిని జైలుకు తీసుకుని వచ్చినప్పుడు ఇతర ఖైదీలు వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, అలాగే బూతులు తిడుతూ విరుచుకు పడడంతో భద్రత రిత్యా వారికి సెక్యురిటీ పెంచారు. ఒక్కొక్కరికి ఇద్దరు వ్యక్తులను నియమించారు పోలీసులు. 

ఆ నలుగురిని ఎట్టి పరిస్థితుల్లోనూ తోటి ఖైదీలతో కలవనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు జైలు అధికారులు. అండర్‌ ట్రయల్‌ ఖైదీలు కావడంతో వారికి జైలులో ఎలాంటి విధులు అప్పగించమని చెబుతున్నారు జైలు అధికారులు. దీంతో వారికి తోటి ఖైదీలను కలిసే అవకాశం లేదు. జైలులో మొదటి రోజైన ఆదివారం(01 డిసెంబర్ 2019) ఉదయం వారికి టిఫిన్, మధ్యాహ్న భోజనం, రెండుసార్లు టీ ఇచ్చారు. టిఫిన్‌లో పులిహోర.. ఆదివారం కావడంతో మధ్యాహ్నం మటన్‌తో భోజనం అందజేసినట్లు జైలు సిబ్బంది తెలిపారు. 

ఇక ఇవాళ, రేపు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం (సూసైడ్ ఇంటెన్షన్‌) ఉందేమో గుర్తించేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఇక నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులుకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్లు జైలు వైద్యులు నిర్ధారించారు. ఆరు నెలలకోసారి అతడికి డయాలసిస్‌ అవసరం ఉంది. గతంలో అతను నిమ్స్‌లో చికిత్స పొందాడు. నిమ్స్‌ వైద్యులను సంప్రదించి వైద్యం అందిస్తామని జైలు వర్గాలు వెల్లడించాయి.