హైదరాబాద్ లో నారా వారి విందు రాజకీయం

  • Published By: chvmurthy ,Published On : March 2, 2020 / 06:37 PM IST
హైదరాబాద్ లో నారా వారి విందు రాజకీయం

నిరసనలు.. ఆందోళనలు.. అరెస్టులు.. విమర్శలు.. ప్రతివిమర్శలతో ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్న తరుణంలో.. రుచికరమైన విందు రాజకీయం ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ రుచికరమైన విందును ఆస్వాదించిన వారంతా కూడా రాజకీయ వారసులే. ఉరకలెత్తే యువకెరటాలే. వీరంతా ఎందుకు సమావేశమయ్యారు? దీని వెనుక ఉన్న భవిష్యత్‌ రాజకీయ అజెండా ఏంటి? అసలు ఈ విందును ఏర్పాటు చేసిందెవరు? 

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడొక భేటీ ఆసక్తికరంగా మారింది. సడన్‌గా ఇప్పుడే ఎందుకు ఈ సమావేశం జరిగిందనే దానిపై చర్చ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాత ఆ పార్టీని నడిపించేది ఎవరనే ప్రశ్న ఎప్పటి నుంచో వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి రాజకీయ వారసుడు నారా లోకేశ్‌ హైదరాబాద్‌లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన పార్టీకి చెందిన యువనేతలతో భేటీ అయ్యారు. ఇంత సడన్‌గా ఎందుకిలా చేసి ఉంటారనేది చర్చనీయాంశమైంది. విందు సమావేశం నిర్వహించి, మరీ వీరింతా కలసి ఏం చర్చించుకున్నారనే దానిపై వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

నిజానికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు తప్ప.. ఈ యువ నేతలు కీలకపాత్ర పోషించాల్సిన ముఖ్య ఎన్నికలు ఏమీ లేవు. కానీ, నారా లోకేశ్‌ ఇప్పటి నుంచే తన కొత్త టీమ్ రెడీ చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతల తనయులు, వాళ్ల కుటుంబ సభ్యులతో ఆదివారం హైదరాబాద్‌లో విందు సమావేశం జరిగింది. ఇందులో ఎక్కువ శాతం పార్టీకి చెందిన సీనియర్ నేతల తనయులు ఉండటమే విశేషం. అయితే వీళ్లందరనీ పార్టీ భావి నాయకులుగా భావించి, వీళ్లతో లోకేశ్ సమావేశం అయినట్లు చెబుతున్నారు. కాకాపోతే ఈ భేటీలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ వంటి వారు కూడా ఉండటంతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు విన్పిస్తున్నాయి.

పార్టీలోకి యువరక్తం అంటే నేతల వారసుల నుంచే కాకుండా పూర్తిగా కొత్త రక్తం కూడా ఎక్కిస్తేనే.. టీడీపీలో జోష్ వస్తుందని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. సీనియర్ల వారసులతో పాటు కొత్తగా వచ్చే వారిని కూడా ప్రోత్సహిస్తే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉన్నందున బలహీనతలు, విమర్శలున్న నాయకులను ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పక్కకు తప్పించాలని అంటున్నారు. అలానే కొత్తరక్తం తీసుకొస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని సీనియర్‌ నేతలు సూచిస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పాతుకుపోయిన నాయకులను విస్మరించటం కూడా అంత తేలికైన వ్యవహారం కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

నారా లోకేశ్‌తో పాటు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా పాల్గొనడంతో ఈ సమావేశానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. వారసుల సమావేశంలో అయ్యన్న పాత్రుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల, బండారు, కోడెల తనయులతోపాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, దేవినేని చందు లాంటి యువ నేతలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత యువ నాయకత్వం ఇలా ముందుకు రావడం మంచి పరిణామమేనని కార్యకర్తలు అంటున్నారు. అయితే, బ్యాడ్‌ ఇమేజ్‌ ఉన్న వారిని మాత్రం పక్కనపెడితే తప్పకుండా మంచి ఫలితాలు రాబట్టవచ్చని చెబుతున్నారు. 

రాజకీయ వారసుడిగా తెర మీదకు తీసుకొచ్చి, మంత్రి పదవిచ్చిన తర్వాత కూడా లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలు కావటాన్ని బాబు పరివారం జీర్ణించుకోలేక పోతోందని అంటున్నారు. ఈ తరుణంలో టీడీపీకి కొత్త రక్తం ఎక్కించాల్సిందేనని చెబుతున్నారు. కానీ, కుటుంబంలోని వారు తప్పించి మరెవరిని పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం అంత సులువైన పనికాదు. లోకేశ్‌తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణిని కూడా నిలదొక్కుకొనేలా చేస్తే పార్టీ ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.