హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్.. బైక్ పై ఒకరికి, ఫోర్ వీలర్‌లో ఇద్దరికే అనుమతి

  • Published By: veegamteam ,Published On : March 23, 2020 / 10:34 AM IST
హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్.. బైక్ పై ఒకరికి, ఫోర్ వీలర్‌లో ఇద్దరికే అనుమతి

లాక్ డౌన్ ఉన్నా హైదరాబాద్ లో ప్రజలు లెక్క చేయడం లేదు. భారీ సంఖ్యలో ప్రజలు వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. నగరంలో ఏ రోడ్డుపై చూసినా వాహనదారులే కనిపిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంతా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రెండో స్టేజ్ లో ఉంది. ఆ స్టేజ్ లో కరోనాను కట్టడి చేయకపోతే ఆ తర్వాత పరిస్థితి చెయ్యి దాటిపోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. 

హైదరాబాద్ లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సరైన కారణం లేకుండా రోడ్డుపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త రూల్ తెచ్చారు. బైక్ పై అయితే కేవలం ఒకరికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. ఫోర్ వీలర్ లో అయితే కేవలం ఇద్దరికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. అనవసరంగా ప్రజలు ఎవరూ రోడ్డుపైకి రావొద్దని పోలీసులు సూచించారు. మీ మంచి కోసమే ఈ చర్యలు అని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని పోలీసులు రిక్వెస్ట్ చేశారు. కొంత ఇబ్బంది ఉన్నా అందరి క్షేమం కోసం ఇంట్లోనే ఉండాలన్నారు. కాగా ఆటోలు, ట్యాక్సీలకు అస్సలు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా, ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇటలీలో కరోనా దెబ్బకు చనిపోయిన వ్యక్తులతో శవాల గుట్టలు అవుతున్నాయి. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పలు రాష్ట్రాల్లో ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపిస్తోంది. తెలంగాణలో కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 30కి పెరిగింది. ఇప్పటికే ఒకరు కోలుకోగా.. మరో 29 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం(మార్చి 23,2020) ఒక్కరోజే మూడు కొత్త కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, మరొకరు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా వైద్యులు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 30కి చేరింది. వైరస్‌ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో మఖ్యమంత్రి కేసీఆర్‌ పరిస్థితిని ఎ‍ప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా లాక్‌డౌన్‌ పాటించాలని కోరుతున్నారు. మరోవైపు రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించొద్దని వార్నింగ్ ఇస్తున్నారు.

See Also | కరోనా దెబ్బ తట్టుకునేందుకు…ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం