పిల్లర్ కాదు కిల్లర్: ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ

  • Published By: madhu ,Published On : September 23, 2019 / 03:18 AM IST
పిల్లర్ కాదు కిల్లర్: ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ

మెట్రో అధికారుల నిర్లక్ష్యం  ఓ మహిళ ప్రాణం తీసింది. వర్షం పడుతుండడంతో.. మెట్రో స్టేషన్ కింద నిల్చున్న మౌనిక అనే గృహిణి చనిపోయిన ఘటన అమీర్‌పెట్‌లో కలకలం రేపింది. మెట్రో స్టేషన్ పెచ్చులూడి తల మీద పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడలేక పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందింది.

హైదరాబాద్‌ అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌లో యువతి మృతిపై మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి స్పందించారు. ఎత్తునుంచి పదునైన పెచ్చలు తలపై పడడంతోనే మౌనిక మృతి చెందినట్టు తెలిపారు. ఈ ప్రమాదాన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నామని… దీనిపై తాము సంస్థాగతంగా ఇన్వెస్టిగేషన్‌ చేస్తామన్నారు. ఆ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎల్‌ అండ్ టీ రెగ్యులర్‌గా చెకప్‌ చేయాలని ఆదేశించామన్నారు. 

KPHB కాలనీలో ఎస్.ఆర్ హోమ్స్‌లో హరికాంత్ రెడ్డి, మౌనిక దంపతులు నివాసం ఉంటున్నారు. మౌనిక కరీంనగర్‌కు వాసి. వీరికి ఇటీవలే వివాహం జరిగింది. సమీప బంధువుకు అమీర్‌పేటలో హాస్టల్ వసతి చూసేందుకు సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కి అమీర్ పేటలో దిగారు. సారథి స్టూడియో వైపు మెట్రో మెట్లు దిగారు.

ఆ సమయంలో వర్షం పడుతోంది. ఓ పిల్లర్ కింద నిలబడ్డారు. ఒక్కసారిగా మెట్రో స్టేషన్ కాంక్రీటు అంచులు పెచ్చులూడి 9 మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. బలమైన గాయాలు కావడంతో మౌనిక అక్కడికక్కడనే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఈమెను ఆస్పత్రికి తరలించగా..మార్గమధ్యంలోనే కన్నుమూసింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 
Read More : బాబోయ్ మెట్రో : ఆందోళనలో ప్రయాణికులు