మహిళల కోసమే : డయల్ 112 కాల్ చేయండి

  • Published By: veegamteam ,Published On : November 29, 2019 / 04:29 AM IST
మహిళల కోసమే : డయల్ 112  కాల్ చేయండి

ఆపదలో ఉండే యువతులు..మహిళల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ ప్రత్యేక నంబర్ ను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో ఉండే మహిళలు డయల్‌-100, 9490617111 నంబర్‌కు ఫోన్‌ చేయాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు.

గురువారం (నవంబర్ 28)న వెటర్నరీ డాక్టర్ ప్రియాంక దారుణహత్య అనతరం డీజీపీ మహేందర్‌ రెడ్డి పలు సూచనలు చేశారు. రాత్రివేళ ప్రయాణాల్లో మహిళలు, వృద్ధులు తమ వాహనాలు చెడిపోయినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఉద్యోగరీత్యా బైటకు వెళ్లిన మహిళలు..యవతులు అప్రమత్తంగా ఉండాలనీ..సమన్వయంతో వ్యవహరించాలనీ..డీజీపీ సూచించారు.

ప్రమాద సమయాల్లో  డయల్‌-100, 9490617111 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్లు ట్వీట్‌ చేశారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ కూడా ఇవే సూచనలు చేశారు. ప్రమాదంలో ఉన్న మహిళలు డయల్‌-100కు సమాచారం అందించవచ్చు. 

షీ టీమ్స్‌ ల్యాండ్‌ లైన్‌ నంబరు 040-2785 2355, వాట్సాప్‌ నంబరు 9490616555కు సమాచారం ఇచ్చినా వారు వెంటనే సాయం అందిస్తారు. టోల్‌ ఫ్రీ నంబర్లు 112, 1090, 1091 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫోన్‌ చేసి సాయం కోరవచ్చు.

ప్రియాంకారెడ్డి హత్య ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలి. దాని కోసం మహిళలందరూ ఆపద సమయంలో ఆలోచించాలి. అలాగే… ఆపద ఏదైనా ఆదుకొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పోలీసులు అభయమిస్తున్నారు. ప్రత్యేకించి ఎన్నో పనులపై ఒంటరిగా బయటికి వెళ్లి..ఇంటికి చేరుకోవడంలో ఆలస్యమయ్యే మహిళలు, యువతుల కోసం పోలీసులు ఎన్నో ఫెసిలిటీస్ ను  కల్పించారు. ఆపదలో డయల్ 100కు ఫోన్‌చేస్తే దగ్గర్లోని పోలీసులకు సమాచారం వెళ్లే వ్యవస్థ అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల ప్రారంభించిన 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్‌చేస్తే అన్నిరకాల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

ప్రమాదం జరిగిన సమయంలో చాలా మందికి పోలీసులకు సమాచారం అందించాలనిగానీ..ఫోన్ చేయాలని గానీ తోచదు.  చేయాలనేది తోచక ఇబ్బందులపాలవుతున్న ఘటనలు ఉంటున్నాయి. డాక్టర్  ప్రియాంకరెడ్డి హత్యతో ఇదేరకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్నప్పుడు అపరిచితులెవరైనా సాయం అందిస్తామంటే వారిని నమ్మొద్దని, అందుబాటులో ఉన్న పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

అనుకోని ఆపద ఎప్పుడైనా రావొచ్చు.. అందుకే మీ మొబైల్‌లో అర్జెంటుగా 112 నెంబర్‌ని సేవ్ చేసుకోండి.  ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఆ కాంటాక్ట్‌ను,  హోమ్ స్క్రీన్‌‌లో షార్ట్ కట్ పెట్టుకోండి. కొన్ని మొబైల్స్‌లో ప్యానిక్‌ బటన్‌ ఉంటుంది. పోలీస్, ఫైర్, హెల్త్, ఉమెన్ సేఫ్టీ, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ వంటి అన్ని సర్వీసులకి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ ఈ 112. 
మీ ఫోన్లో ప్యానిక్‌ బటన్‌ ప్రెస్ చేయాలంటే.. పవర్ బటన్‌ని మూడుసార్లు వెంటవెంటనే ప్రెస్ చేస్తే చాలు.. అది 112కి కనెక్ట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కాకుండా నార్మల్ ఫోన్ వాడే వారు.. తమ కీప్యాడ్ మీద 5 లేదా 9 బటన్లని లాంగ్ ప్రెస్ చేస్తే పానిక్ బటన్ యాక్టివేట్ అవుతుంది. 2018కి ముందు కొన్న ఫోన్లలో ఈ సదుపాయం ఉండదు. అలాంటప్పుడు 112 నెంబర్ సేవ్ చేసుకుని, ప్రమాదంలో ఉన్నప్పుడు దానికి డయల్ చెయ్యాలంటున్నారు పోలీసులు.