తెలంగాణలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల హడావుడి మొదలైంది.

  • Published By: veegamteam ,Published On : March 23, 2019 / 02:33 AM IST
తెలంగాణలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల హడావుడి మొదలైంది.

హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల హడావుడి మొదలైంది. మొన్నటి వరకు మందకొడిగా సాగిన నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. గడువు దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో సందడి పెరిగింది. వరుసగా రెండు రోజులు సెలవు వస్తుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్రధాన నేతలంతా దాదాపుగా నామినేషన్‌ దాఖలు చేశారు. 

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్‌ తరపున కల్వకుంట్ల కవిత నామినేషన్‌ వేశారు. నిజామాబాద్‌ శివారులోని సారంగపూర్ హనుమాన్‌ ఆలయంలో కవిత తన భర్త అనిల్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెంటరాగా నామినేషన్‌ దాఖలు చేశారు. 
Read Also : ఎన్నికలకు మరో ఇరవై రోజులే : మేనిఫెస్టో రిలీజ్ చేయని టీడీపీ, వైసీపీ

మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మొదట కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి  మాజీమంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఇదే స్థానాకి కాంగ్రెస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌తోపాటు మరో ముగ్గురు స్వతంత్రులూ నామినేషన్‌ వేశారు.

భువనగిరి లోక్‌సభకు టీఆర్‌ఎస్‌ తరపున బూర నర్సయ్యగౌడ్‌ తన నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి జగదీష్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ తరపున శ్యాంకుమార్‌తోపాటు మరో ఆరుగురు ఇండిపెండెంట్లు నామినేషన్‌ వేశారు. చేవెళ్ల పార్లమెంట్‌కు డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి నామినేషన్‌ సమర్పించారు. మాజీమంత్రి మహేందర్‌రెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు.

మల్కాజ్‌గిరి ఎంపీ సీటుకు కాంగ్రెస్‌ తరపున రేవంత్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. చీర్యాల క్రాస్‌ రోడ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఇక సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి నామినేషన్‌ వేశారు.

చేవెళ్ల స్థానానికి శుక్రవారం ఒక్కరోజే ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు నలుగురు ఇండిపెండెంట్లు నామినేషన్‌ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్‌ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుతోపాటు మరొక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ వేశారు.

ఇక కరీంనగర్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్న ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ నామినేషన్లు వేశారు. పెద్దపల్లి ఎంపీ సీటుకు కాంగ్రెస్‌ తరపున ఎ. చంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌ తరపున వెంకటేష్‌ నేతకాని నామినేషన్‌ దాఖలు చేశారు. వీరితోపాటు ఆరుగురు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్‌ వేశారు. జహీరాబాద్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీపాటిల్‌ తరపున ఎమ్మెల్యే క్రాంతి నామినేషన్‌ దాఖలు చేశారు. మరో ముగ్గురు స్వతంత్రులు కూడా నామినేషన్‌ వేశారు.

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి సహా ఐదుగురు ఇండిపెండెంట్లు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నాగర్‌కర్నూలులో టీఆర్‌ఎస్‌ తరపున పి. రాములు, బీజేపీ తరపున బంగారు శృతితోపాటు మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్‌ వేశారు.  నల్లగొండ లోక్‌సభ స్థానంలో  కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఎం తరపున మల్లు లక్ష్మితోపాటు నలుగురు ఇండిపెండెంట్లు నామినేషన్‌ దాఖలు చేశారు. 

వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సాంబయ్య, టీఆర్‌ఎస్‌ తరుపు పసునూరి దయాకర్‌తోపాటు ఆరుగురు స్వతంత్రులు నామినేషన్లు సమర్పించారు. మహబూబాబాద్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తోపాటు ఐదుగురు ఇండిపెండెంట్లు నామినేషన్‌ వేశారు. 
Read Also : వైసీపీ షాకింగ్ డెసిషన్ : హిందూపురం బరిలో గోరంట్ల మాధవ్ భార్య