సోమవారం నోటిఫికేషన్ : నామినేషన్ల ప్రక్రియ మొదలు

  • Published By: chvmurthy ,Published On : March 17, 2019 / 02:42 AM IST
సోమవారం నోటిఫికేషన్ : నామినేషన్ల ప్రక్రియ మొదలు

హైదరాబాద్:  ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌ కోసం  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్‌  చెప్పారు.  మార్చి 18 సోమవారం  నోటిఫికేషన్‌ జారీ చేసి ఆ వెంటనే నామినేషన్ల  ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 20 స్థానాలపై కోర్టుల్లో ఎన్నికల పిటిషన్లు దాఖలైనందున అక్కడి ఈవీఎంలను వినియోగించుకునే వీల్లేదని, అందుకే రాష్ర్టానికి అదనంగా  మరో 17,131 బ్యాలెట్‌ యూనిట్లు, 13,064 కంట్రోల్‌ యూనిట్లు, 13,982 వీవీప్యాట్లను  తెప్పించామని  రజత్ కుమార్ వివరించారు. ఓటరు ఫొటో గుర్తింపు కార్డును మీ సేవా కేంద్రాల్లో రూ.25కే అందించాలని ఆదేశించామన్నారు. కొత్తగా నమోదైన 17.75 లక్షల మందితోపాటు అనుబంధ జాబితాలో చేరే మరో 3 లక్షల మంది ఓటర్లకు ఉచితంగానే ఎపిక్‌ కార్డులు పంపిణీ చేస్తామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఆయుధాలను తిరిగి ఇవ్వలేదని, ఇంకా ఎవరి దగ్గరైనా ఆయుధాలుంటే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బైండోవర్‌ చేసిన వారికి 6 నెలలు ఈ నిబంధన వర్తిస్తుందని సీఈవో తెలిపారు. లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు సంబంధిత నియోజకవర్గ పరిధిలోనే నియుక్తమైతే వారు అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రజత్‌కుమార్ చెప్పారు. ప్రత్యేకంగా పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.  డేటా చౌర్యం కేసుతో తమకు సంబంధం లేదని, ఇది పోలీసు విచారణలో ఉందని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.