తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 12:12 PM IST
తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికలకు జరుగనున్నాయి. ఈసీ మే 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 2014 ఓటర్ జాబితా ప్రకారమే ఓటింగ్ జరుగనుంది. మే 31 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మే 14 లోపు నామినేషన్ దాఖలు చేయాల్సివుంది. జూన్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం జూన్ 5వ తేదీతో ముగియనుంది. 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థిగా గూడూరు నారాయణరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్ రెడ్డి రంగారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. 

అయితే ఈ ఎన్నికలు కొంత వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. మే 6న మొదటి విడత ఎన్నికలు జరిగాయి. మే 10న రెండో విడత, మే 14న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నుకుంటారు. ప్రస్తుతమున్న 2 వేల 500 మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. వీరి పదవీకాలం జూన్ 5 తో ముగియనుంది. పదవీకాలం ముగిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మాత్రమే ఎన్నికల్లో పాల్గొంటున్నారు. జూన్ 5 తర్వాత కొత్తగా బాధ్యతలు స్వీకరించే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు. 

ప్రస్తుతమున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఓటు హక్కు ఉండటం, కొత్తగా ఎన్నికయ్యే వారికి లేకపోవడంపై కాంగ్రెస్, టీడీపీ, ప్రజాకూటమిలోని జన సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పదవీకాలం ముగిసే వారు లోకల్ బాడీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎన్నుకోవడమేంటీ? కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించేవారు మాత్రమే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని వివిధ పార్టీలు ఈసీని కలిసి వినతి పత్రం సమర్పించాయి. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఓటు హక్కు కల్పించాలని విపక్షాలు కోరుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.