సిగిరెట్ వల్లనే నుమాయుష్ ప్రమాదం : ఈటల 

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 09:40 AM IST
సిగిరెట్ వల్లనే నుమాయుష్ ప్రమాదం : ఈటల 

నాంపల్లి : నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరగడం విచారకరమని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఓ షాపు వద్ద కాల్చి పడేసిన సిగరెట్ వల్లే మంటలు వ్యాపించినట్లు తమకు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. ప్రమాదంలో నష్టపోయిన  బాధితులను ఎగ్జబిషన్ సొసైటీ ఆదుకుంటుందని..ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. 

ఎగ్జిబిషన్‌ల్లో స్టాల్స్  ఏర్పాటు విషయంలో అన్ని విధాల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఏర్పాటు చేశామన్నారు. అయితే షాపుల యజమానులు లోపల ప్లైవుడ్, కర్రలతో తమకు అనుకూలంగా మార్చుకోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని ఈటల తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అందుబాటులో ఉన్న ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారనీ..ఇందులో సిబ్బంది ఏమరపాటు ఏమీ లేదని స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్‌లోని షాపులకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ లేదని, బాధితులకు సొసైటీ తరుపున తక్షణ సాయం అందిస్తామన్నారు. వ్యాపారులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

 

ఎగ్జిబిషన్‌ కారణంగా రోజూ ట్రాఫిక్ జామ్ జరగుతోందనీ..దీంతో ప్రభుత్వం పలు మార్పులు చేయాలనుకుంటోందని తెలిపారు.ఎగ్జిబిషన్ సొసైటీ అనేది వ్యాపార సంస్థ కాదని, దీని ద్వారా వచ్చే ఆదాయంతో 18 విద్యాసంస్థలు నిర్వహిస్తున్నామని, త్వరలోనే అనాథ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించాలనుకుంటున్నామని వెల్లడించారు. సహాయచర్యలు పూర్తిచేసి రెండ్రోజుల్లో ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభిస్తామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ఉన్న ఫైరింజన్‌లో నీళ్లు లేకపోవడంతో సహాయచర్యలు ఆలస్యమయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ ప్రమాదంపై రెండ్రోజుల్లో నివేదిక వస్తుందని.. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామనీ.. వచ్చే ఏడాది నుంచి ఎగ్జిబిషన్‌లోని ప్రతి షాపులో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.