తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

  • Published By: veegamteam ,Published On : November 17, 2019 / 05:14 AM IST
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను చేపట్టడంతో పాటు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. క్యాబినెట్‌ హోదా కలిగిన ఈ పదవికి మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి చైర్మన్‌గా నియమితులవడంతో ఆయన స్థానంలో పల్లాను సీఎం నియమించారు. రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలో నియమించనున్నట్లు సీఎం ప్రకటించారు.

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ విప్‌గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో పార్టీ ఇన్‌చార్జిగానూ వ్యవహరించారు. కేబినెట్ విస్తరణలో పల్లాకు చోటు దక్కుతుందని భావించారు. సామాజిక వర్గాల సమీకరణలో అవకాశం దక్కకపోవడంతో మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది.

అయితే గతంలో రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ చైర్మన్‌గా పని చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి.. మండలి చైర్మన్‌గా ఎన్నిక కావడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పించారు. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత పదవుల పందేరం ఉంటుందని భావించినా, ఎన్నికల నిర్వహణపై స్పష్టత రావడం లేదు. దీంతో నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. 

రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా తనను నియమించడం పట్ల పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం (నవంబర్17, 2019) ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం పల్లాను అభినందించారు. రైతులకు అండగా ఉండేలా రైతు సమన్వయ సమితిలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. వచ్చే జూన్‌ లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేయాలని తెలిపారు. సమితిల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.