పంచాయతీ ఎన్నికలు ముగిశాయి : మూడో విడత ప్రశాంతం

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 09:56 PM IST
పంచాయతీ ఎన్నికలు ముగిశాయి : మూడో విడత ప్రశాంతం

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.

హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. తుది విడతోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. టీఆర్ ఎస్ మద్దతుదారులు అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. తుది దశలో 88.03శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.99శాతం, అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 77.70శాతం పోలింగ్‌ నమోదైంది.

 
మూడో విడతలో 3,529 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించగా.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి టీఆర్ఎస్ 2505, కాంగ్రెస్‌ 954, టీడీపీ 13, భాజపా 59, సీపీఐ 19, సీపీఎం 21, ఇతరులు 509 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం మూడు విడతల్లో టీఆర్ఎస్ 7744, కాంగ్రెస్ 2709, టీడీపీ 83, బీజేపీ 163, సీపీఎం 77, సీపీఐ 50, ఇతరులు 1828 స్థానాల్లో గెలుపొందారు.

నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లిలో ఇద్దరు సర్పంచ్‌ అభ్యర్థులకు సమాన ఓట్లు పోలయ్యాయి. ఓట్లు సమానంగా రావడంతో ఆర్డీవో సమక్షంలో రీకౌంటింగ్‌ నిర్వహించారు. రీకౌంటింగ్‌లోనూ సమాన ఓట్లు రావడంతో ఫలితంపై సందిగ్ధత నెలకొంది. దీంతో అధికారులు ఫలితం ప్రకటించకుండా నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడవగల్‌ మండలం పెద్దదేవిసింగ్‌ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంచయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సుందర్‌ విజయం సాధించారు. గెలిచిన వర్గం సంబరాలు చేసుకుంటుండగా మరో వర్గం రాళ్లతో దాడి చేసింది. మరి కొందరు కౌంటింగ్‌ కేంద్రంలో కుర్చీలు ధ్వంసం చేశారు. ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సూర్యాపేట జిల్లా జాన్‌పహడ్‌దర్గా పరిధిలోని కల్మెడ తండాలో ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేసుకుని గెలిచారని కాంగ్రెస్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ వర్గీయులకు పోలీసులు సహకరించారని టీఆర్ఎస్ వర్గం ఆరోపించింది. ఘర్షణకు పాల్పడిన వారిపై రెండు సార్లు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. గ్రామంలో రీపోలింగ్‌ నిర్వహించాలని టీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.
మూడో విడత

  • 3,529 పంచాయతీలకు పోలింగ్‌
  • టీఆర్ఎస్ 2505 స్థానాల్లో విజయం   
  • కాంగ్రెస్‌ 954 స్థానాల్లో విజయం 
  • టీడీపీ 13 స్థానాల్లో విజయం 
  • భాజపా 59 స్థానాల్లో విజయం 
  • సీపీఐ 19 స్థానాల్లో విజయం 
  • సీపీఎం 21 స్థానాల్లో విజయం 
  • ఇతరులు 509 స్థానాల్లో విజయం 

మొత్తం మూడు విడతల్లో కలిపి

  • టీఆర్ఎస్ 7744 స్థానాల్లో గెలుపు 
  • కాంగ్రెస్ 2709 స్థానాల్లో గెలుపు
  • టీడీపీ 83 స్థానాల్లో గెలుపు 
  • బీజేపీ 163 స్థానాల్లో గెలుపు 
  • సీపీఎం 77 స్థానాల్లో గెలుపు 
  • సీపీఐ 50 స్థానాల్లో గెలుపు 
  • ఇతరులు 1828 స్థానాల్లో గెలుపొందారు.