మందుబాబుల డ్రామా : కరోనా వంకతో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్ తప్పించుకునే ప్లాన్‌

  • Published By: veegamteam ,Published On : February 2, 2020 / 01:54 AM IST
మందుబాబుల డ్రామా : కరోనా వంకతో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్ తప్పించుకునే ప్లాన్‌

కరోనా వైరస్‌ మందుబాబులకు అవకాశంలా మారింది. డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టుల్లో బ్రీత్‌ అనలైజర్‌ వాడితే వైరస్‌ సోకుతుందంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు. పోలీసుల కోసం మా ప్రాణాలు తీసుకోవాలా అంటూ వాదిస్తున్నారు. బ్రీత్‌ ఎనలైజర్లను పక్కనబెట్టాలంటూ పోలీస్‌ బాస్‌ ఎదుట వెరైటీ డిమాండ్‌ పెడుతున్నారు.

ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. భారత్‌లో కూడా ఈ మహమ్మారి ప్రవేశించిందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. వైరస్‌ బారిన పడకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. అందరిలోనూ కరోనా పుట్టించిన భయాన్నే క్యాష్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు మందుబాబులు. ఎప్పుడు ఛాన్స్‌ దొరికితే డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నుంచి తప్పించుకుందామా అని చూసే వారికి ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌ కలిసొచ్చింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎదుట ఓ డిమాండ్‌ పెట్టేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో మందుబాబులకు ఓ కొత్త ఐడియా వచ్చింది. ఎలాగో కరోనా పేరు వింటే ప్రపంచం వణికిపోతోంది. ఈ వంక పెట్టుకుని డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్ నుంచి ఎందుకు తప్పించుకోకూడదని ప్లాన్‌ చేశారు. వెంటనే హైదరాబాద్ సీపీ ముందు డిమాండ్ పెట్టారు. కరోనా వైరస్ సోకుతున్న నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బ్రీత్ ఎనలైజర్లను నిషేధించాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది అంటువ్యాధి కాబట్టి అందరికీ ఒకే బ్రీత్ ఎనలైజర్‌ను వాడితే… కరోనా వైరస్‌ తొందరగా సోకే ప్రమాదం ఉందని మందుబాబులు చెప్తున్నారు. దగ్గు, తుమ్ము, మనిషిని తాకడం వల్ల కరోనా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి బ్రీత్ ఎనలైజర్లు వాడొద్దని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రీత్ ఎనలైజర్లను వాడటం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు. దీన్ని వాడుతున్న అధికారుల జీవితాన్ని కూడా ఫణంగా పెట్టొద్దని ఉచిత సలహా పారేస్తున్నారు.

అంతేకాదు రోడ్లపై డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు గత రెండు మూడ్రోజులుగా ముందుబాబులు చుక్కలు చూపిస్తున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌కు సహకరించకుండా కొందరు వాగ్వాదానికి దిగుతున్నారు. అందరి నోట్లో పెట్టిన మెషీన్‌తోనే మాక్కూడా పరీక్ష చేస్తారా అని సీరియస్‌ అవుతున్నారు. మీ ఉద్యోగాల కోసం మా ప్రాణాన్ని ఫణంగా పెట్టాలా అని క్వశ్చన్‌ చేస్తున్నారు.

కరోనా పేరు వాడుకుని మందుబాబులు పెడుతున్న డిమాండ్లను పోలీసులు కొట్టి పారేస్తున్నారు. వైరస్‌ పేరు చెప్పి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి ప్లాన్‌ చేశారని… ఇలాంటి ఆటలు తమ దగ్గర సాగవంటున్నారు ట్రాఫిక్‌ పోలీసులు.

బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌లో ఎప్పటికప్పుడు స్ట్రాలు మార్చేస్తామని… దీనివల్ల ఎలాంటి హానీ ఉండదని చెప్తున్నారు. మందుబాబులు ఎన్ని వేషాలేసినా వర్కవుట్‌ కాదని… మద్యం తాగి వాహనాన్ని నడిపితే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇస్తున్నారు.