పోలీసుల అదుపులో ప్రదీప్.. వితంతవులే టార్గెట్, మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా 20మంది మహిళలను మోసగించాడు

  • Published By: naveen ,Published On : November 12, 2020 / 04:31 PM IST
పోలీసుల అదుపులో ప్రదీప్.. వితంతవులే టార్గెట్, మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా 20మంది మహిళలను మోసగించాడు

pradeep matrimony sites: రెండో వివాహం చేసుకోవాలనుకునే ఒంటరి మహిళలే అతని లక్ష్యం. మాటలే అతని పెట్టుబడి. మ్యాట్రిమోనీ సైట్ లో మాటలు కలుపుతాడు. సోషల్‌ మీడియాలో చాటింగ్ చేస్తాడు. తియ్యని మాటలతో బుట్టలో పడేస్తాడు. తర్వాత పక్కా ప్లాన్ అమలు చేస్తాడు. నేరుగా ఇంటికే దిగిపోతాడు. మరిన్ని మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకుంటాడు. అంతటితో ఆగడు. అప్పుల్లో ఉన్నానని, ఇంకేదో బాధల్లో ఉన్నానని చెప్పి…బాధ నటించి…డబ్బులు దోచుకుంటాడు. అతని బాధితుల ఖాతాలో ఉన్న మహిళల సంఖ్య ఒకటి కాదు..రెండు కాదు…20 మంది మహిళలను ఇలా నిలువునా దోచుకున్న ఆ నయవంచకుడి ఆట కట్టించారు విజయవాడ కృష్ణలంక పోలీసులు.

మ్యాట్రిమోనీ వేదికగా మోసాలు:
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన జగ్గవరపు ప్రదీప్‌కుమార్‌ మ్యాట్రిమోనీ వేదికగా మోసాలకు తెగబడ్డాడు. 2017లో పెళ్లి చేసుకుని.. తర్వాత రెండేళ్లకు విడాకులు తీసుకున్న ప్రదీప్….2019లో మ్యాట్రిమోనీ సైట్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ సైట్‌లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు. సైట్‌లోని వివరాలతో ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. వాట్సప్, ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేసేవాడు.

మాయమాటలతో మహిళ నుంచి 12లక్షలు కాజేసిన ప్రదీప్:
అలా పరిచయం క్రమంగా పెంచుకుని…ఆ మహిళల ఇంటికే వెళ్లి మాయ మాటలతో లోబర్చుకునేవాడు. ఇలాగే విజయవాడకు చెందిన ఓ మహిళను ప్రదీప్ మోసం చేశాడు. ఆమెతో పరిచయం పెంచుకున్న ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాగా దగ్గరైన తర్వాత ప్రస్తుతం తన కుటుంబ పరిస్థితి బాగాలేదని, అప్పుగా కొంత మొత్తం ఇస్తే.. కొద్ది రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అతని కల్లబొల్లి మాటలు నమ్మిన ఆ మహిళ అనేక విడతలుగా 12లక్షల 20వేలు వసూలు చేశాడు.

మొదట్లో ప్రదీప్ వ్యవహారం బాగానే ఉన్నప్పటికీ…అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని మహిళ కోరడంతో..అతను.. తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫోన్ సిగ్నల్ ద్వారా అతను మాదాపూర్‌లో ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు కృష్ణలంక పోలీసులు. పోలీసుల విచారణలో ప్రదీప్ ఇదే తరహాలో దాదాపు 20 మంది మహిళలను మోసం చేసినట్టు తేలింది.

మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయాలపై జాగ్రత్త:
కాకినాడ పోలీస్ స్టేషన్‌లో గతంలో అతనిపై కేసు కూడా నమోదైంది. ఎవరికీ దొరకకుండా ఉండేందుకు నిత్యం కారులోనే తిరుగుతుంటాడని కర్నాటక, కేరళ నెంబర్ ప్లేట్లను కారుకు ఉపయోగిస్తాడని పోలీసులు గుర్తించారు. ప్రదీప్ లాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.