విచారణకు రాలేదు.. రవిప్రకాశ్‌‌ను అరెస్ట్ చేస్తారా?

  • Published By: vamsi ,Published On : May 15, 2019 / 05:48 AM IST
విచారణకు రాలేదు.. రవిప్రకాశ్‌‌ను అరెస్ట్ చేస్తారా?

సిగ్నేచర్ ఫోర్జరీ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో శివాజీ, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌‌కు ఇప్పటికే రెండుసార్లు(మే 9, 11 తేదీల్లో) సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చిననప్పటికీ విచారణకు హాజరుకాలేదు. దీంతో సోమవారం(2019 మే 13) మరోసారి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) ప్రకారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 15వ తేదీ ఉదయం 11 గంటలకల్లా సైబరాబాద్‌ కమిషనరేట్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు రవిప్రకాశ్. అయితే ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు నిరాకరించింది. దీంతో పోలీసుల విచారణకు ఆయన తప్పకుండా హాజరుకావాల్సిందే. అయితే 11గంటలకు హాజరు కావలసి ఉన్నా కూడా హాజరుకాలేదు. ఇక రవిప్రకాశ్‌ విచారణకు రాకపోతే ఏం చేయాలన్నదానిపైనా పోలీసులు ప్లాన్(బీ) కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్‌ పోలీసుల ఎదుట హాజరుకాకపోతే అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని భావిస్తుంది.

కోర్టు అనుమతి మేరకు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లుక్ ఔట్ నోటీసులను కూడా జరీ చేసే అవకాశం ఉంది. ఈ నోటీసులు జారీ చేస్తే.. విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేస్తారు. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఈ నోటీసులు ఇస్తారు. దీంతో ఆయన ఎక్కడ కనిపించినా అరెస్టు చేసేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. అవసరమైతే అతనిని గాలించేందుకు ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపుతారు.