హోం క్వారంటైన్ ముద్రతో హైటెక్ సిటీ దగ్గర యువకుడిని పట్టుకున్న పోలీసులు, కేసు నమోదు

  • Edited By: veegamteam , March 24, 2020 / 12:20 PM IST
హోం క్వారంటైన్ ముద్రతో హైటెక్ సిటీ దగ్గర యువకుడిని పట్టుకున్న పోలీసులు, కేసు నమోదు

ప్రభుత్వం నెత్తీ నోరు బాదుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమతో పాటు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి సహకారం ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్ లో 14 రోజుల పాటు ఉండాలి. కానీ కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. తాజాగా క్వారంటైన్ నిబంధన ఉల్లంఘించి రోడ్డుపై తిరుగుతున్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ హైటెక్ దగ్గర రాజేశ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. మార్చి 19న ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వచ్చాడు. అతడు 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి.

అయితే రాజేష్ నిబంధనలు లెక్క చేయలేదు. తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపైకి వచ్చాడు. హైటెక్ సిటీ దగ్గర తిరుగుతున్నాడు. అతడి చేతిపై హోం క్వారంటైన ముద్రని చూసిన పోలీసులు వెంటనే రాజేష్ ని పట్టుకున్నారు. గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడికి పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాజేష్ తల్లిదండ్రులకు కూడా అధికారులు పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రులను హోం క్వారంటైన్ లో ఉంచారు. హోం క్వారంటైన్ లో ఉండకుండా రోడ్డుపైకి వచ్చిన రాజేష్ పై అధికారులు కేసు నమోదు చేశారు.

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వ్యాప్తి కట్టడికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లాక్ డౌన్ ప్రకటించారు. ఆంక్షలు విధించారు. పలు నిబంధనలు విధించారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అందరి ప్రాణాలు ప్రమాదంలో పడేస్తున్నారు. దీంతో ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తోంది.