‘కాస్ట్‌లీ’ గురూ : పంచాయతీ కౌంట్ డౌన్

  • Published By: madhu ,Published On : January 16, 2019 / 02:29 PM IST
‘కాస్ట్‌లీ’ గురూ : పంచాయతీ కౌంట్ డౌన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. మూడు దఫాలుగా పోలింగ్ జరుగనుంది. 12వేల 732 గ్రామాల‌లో ఎన్నిక‌లు జరుగుతాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి విడతగా జనవరి 21న పోలింగ్ జరుగనుంది. 14 వేల 479 గ్రామ పంచాయతీల‌కు గాను… 23 వేల 229 మంది బ‌రిలో ఉన్నారు. ఇందులో చాలా వ‌ర‌కూ ఏక‌గ్రీవాలు చేసేందుకు ప్రయ‌త్నాలు సాగుతున్నాయి. మరోవైపు  రెండో ద‌శ‌లో 4వేల 135 గ్రామాలలో  25న  పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీనికి కూడా ఇప్పటికే 15 వేల 49 మంది పోటీ ప‌డుతున్నారు. 
పట్టుబడ్డ నగదు రూ. 12 కోట్లు
రూ. 6 లక్షల విలువైన వస్తువులు  
రూ. 12 లక్షల విలువైన మద్యం

పంచాయతీ ఎన్నిక‌ల్లోనూ పదవిని చేజిక్కించుకొనేందుకు నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. భారీగానే మ‌ద్యం, డ‌బ్బు ప‌ట్టుపడుతున్నాయి. ఇప్పటికే 12 కోట్ల 12ల‌క్షల 3వేల 820 రూపాయల నగదు ప‌ట్టుప‌డగా…6 లక్షల 26వేల 107రూపాయ‌ల విలువున్న వస్తువులను సీజ్ చేశారు. వీటితో పాటు జగిత్యాల‌, జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి, మెదక్‌, క‌రీంన‌గ‌ర్, రామ‌గుండంలో  రూ. 12 ల‌క్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నారు. గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యాన్ని అరికట్టేందుకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. పోలీసుల సాయంతో తనిఖీలు ముమ్మరం చేశారు.