పోలీస్ టెక్నాలజీ : ముఖం  చూసి దొంగో కాదు చెప్పేస్తారు 

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 07:00 AM IST
పోలీస్ టెక్నాలజీ : ముఖం  చూసి దొంగో కాదు చెప్పేస్తారు 

నేరాల నిరూపణలో టెక్నాలజీ కీలక పాత్ర
కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ పోలీస్ 
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తో నేరాల గుర్తింపు 
టీఎస్‌కాప్‌తో అనుసంధానం చేసిన పోలీస్‌శాఖ
పోలీసుల చేతికి బ్రహ్మాస్త్రం ఎఫ్‌ఆర్‌ఎస్: డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్: టెక్నాలజీ నేరస్థులకు ఎంతగా ఉపయోగపడుతోందా..అంతకంటే ఎక్కువగా పోలీసులు కూడా అదే టెక్నాలజీని ఉపయోగించి నేరస్థుల గుట్టు బైటపెడుతున్నారు. ఈ క్రమంలో నేరాలను ఛేదించేందుకు తెలంగాణ పోలీసు శాఖ మరో ముందడుగు వేసింది. అదే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS). నేరాలు జరిగిన సందర్భంగా పోలీసులు సాధారణంగా పాత నేరస్థులను అనుమానిస్తుంటారు. ఈ విషయంలో అనుమానితులు అసలైన నేరస్థులా..కాదా  ఏదైనా కేసులో శిక్షకు గురయ్యారా అనే విషయంలో ఆయా నేరస్థుల ముఖాలను గుర్తించే అధునాతన సాంకేతిక వ్యవస్థ ఇట్టే చెప్పేస్తుంది.

అనుమానితులను గుర్తించిన వెంటనే వారు గతంలో నేరం చేశారా..లేదా అనే విషయాన్ని క్షణాల్లో తెలుసుకునే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) పోలీసుల చేతిలో ఒక బ్రహ్మాస్త్రంగా మారబోతున్నదని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. టీఎస్‌కాప్ మొబైల్‌యాప్‌తో అనుసంధానించిన ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని ఆయన జనవరి 24న తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లందరికీ ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. నేరస్థులతోపాటు, అనాథ శవాలను, తప్పిపోయిన చిన్నారుల జాడను ఈ విధానంతో గుర్తించవచ్చన్నారు. అనుమానితుడిని గుర్తించడంతోపాటు, నేరంతో సంబంధం లేనివారిని కాపాడేందుకూ ఈ విధానంతో వీలుంటుందని తెలిపారు. ఎవరైనా అనుమానితుడి ఫొటోను ఎఫ్‌ఆర్‌ఎస్‌లో అప్‌లోడ్ చేశాక డాటాబేస్‌లోని ఏ ఫొటోతో సరిపోలకపోతే ఆ ఫొటో అందులోనుంచి ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుందని డీజీపీ తెలిపారు. 

అయితే ఎఫ్‌ఆర్‌ఎస్‌లో పోల్చి చూసినప్పుడు 90శాతం ఫొటో సరిపోయినంత మాత్రాన అనుమానితుడే నేరస్థుడని నిర్ధారించలేమని, ఇది కేవలం ఒక క్లూగా మాత్రమే ఐఓకు ఉపయోగపడుతుందని..కోర్టులో సాక్ష్యంగా దీన్ని చూపలేమని మహేందర్ రెడ్డి తెలిపారు. సీసీటీఎన్‌ఎస్‌లోని వివిధరాష్ర్టాలకు చెందిన నేరస్థుల ఫొటోలు, దేశవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో మీడియాలో వచ్చిన నిందితుల ఫొటోలను, వివిధ రాష్ర్టాల పోలీస్ విభాగాల వెబ్‌సైట్లలోని మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్ ఫొటోలను సైతం సేకరించి డాటాబేస్‌లో నిక్షిప్తం చేస్తున్నట్టు తెలిపారు. 

ఎఫ్‌ఆర్‌ఎస్ వాడకంపైనా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. నూతన సాంకేతిక పరిజానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా నేరస్థులకు శిక్షపడేలా చేయగలుగుతామని డీజీపీ చెప్పారు. నేరంచేస్తే వందశాతం దొరికిపోతాం, వందశాతం శిక్షపడుతున్న భయాన్ని కల్పించడం ద్వారా నేరరహిత తెలంగాణను సాధించడం సాధ్యమవుతుందన్నారు. ఇదే టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు ఓ 70 ఏళ్ల మానసిక సమస్యలతో వున్న ఓ మహిళను గుర్తించి వారి కుటుంబానికి అప్పగించారు. ఇటువంటి కొన్ని సమస్యలకు ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తో కొన్ని సమస్యలకు పరిష్కారం అయిన సందర్భాలు కూడా వున్నాయి.

ఢిల్లీలోను కొన్ని సందర్భాలు..
ఢిల్లీ పోలీసులు 2018 ఏప్రిల్‌లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. వేర్వేరు పోలీస్‌ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా పిల్లల ఫొటోలు సేకరించి..ఆ సాఫ్ట్‌వేర్‌తో ఢిల్లీలోని అనాథ ఆశ్రమాలలో ఉంటున్న చిన్నారుల ముఖాలను పోల్చి చూశారు. అలా కేవలం నాలుగు రోజుల్లోనే 2,930 మంది అదృశ్యమైన చిన్నారులను గుర్తించారు.