ఓట్ల కోసమే మహిళా జపం : మూలనపడ్డ 33 శాతం రిజర్వేషన్

తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలుంటే... అన్ని పార్టీల నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు.

ఓట్ల కోసమే మహిళా జపం : మూలనపడ్డ 33 శాతం రిజర్వేషన్

తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలుంటే… అన్ని పార్టీల నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు.

హైదరాబాద్ : మహిళలకు పెద్దపీట వేసింది మేమే అని ఒకరు.. కాదు కాదు.. 33 శాతం రిజర్వేషన్ కల్పించింది తామే అంటూ ఇంకొకరు.. వాళ్లు, వీళ్లు అని తేడా లేదు అన్ని పార్టీలూ మహిళా జపం చేసాయి. కానీ… టికెట్ల విషయానికి వచ్చే సరికి పెద్ద మనసు చాటుకోలేకపోయాయి. ఇంతకీ తెలంగాణలో మహిళలకు ఏ పార్టీ ఎన్ని సీట్లిచ్చింది.

ఎన్నికల వేళ పార్టీలు చేసే ఫీట్లు చాలానే ఉంటాయి. సామాజిక వర్గాలు, కులమతాలు, ఏ అంశాన్ని కూడా పార్టీలు వదులుకోవు. అది చేస్తాం.. ఇది ఇస్తాం అని తాయిలాలు ప్రకటించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక మహిళల కోసం కొత్త కొత్త స్కీమ్‌లు ప్రకటిస్తుంటాయి. కొన్ని పార్టీలైతే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని.. ఎన్నికల్లో కూడా 33 శాతం సీట్లు కేటాయిస్తామంటూ గొప్పలకు పోయాయి. కానీ.. ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఆ సంగతే మర్చిపోయాయి.

తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలుంటే… అన్ని పార్టీల నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ ఇద్దరు మహిళలకు టికెట్లు కేటాయించింది. నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితను ఎన్నికల బరిలోకి దింపింది. బీజేపీ కూడా ఇద్దరు మహిళకు సీట్లిచ్చింది. మహబూబ్‌నగర్ నుంచి మాజీమంత్రి డీకే అరుణ.. నాగర్‌కర్నూల్ నుంచి బంగారు శృతికి టికెట్లించింది. ఈసారి అధికారంలోకి వస్తే… మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్న కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశమిచ్చింది. ఖమ్మం నుంచి ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరిని బరిలోకి దింపింది. అది కూడా చివరి నిముషంలోనే ఆమెకు సీటు ఇచ్చింది.

పార్టీల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు ప్రాధాన్యం ఇస్తామనే మాటలే తప్ప చేతల్లో మాత్రం చూపించలేకపోతున్నాయి. అయితే.. గతంలోకంటే ఈసారి కొంచెం బెటర్ అనే వాదనకూడా వినిపిస్తుంది. ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో కేవలం టీఆర్ఎస్ మాత్రమే కవితకు నిజామాబాద్ టికెట్ కేటాయించింది. కాంగ్రెస్, బీజేపీలు ఒక్క మహిళను కూడా పోటీకి దింపలేదు. ఈసారి మూడు పార్టీల నుంచి బరిలో ఉన్న ఐదుగురిలో ఒకరు సిట్టింగ్ ఎంపీ కాగా.. మిగతావాళ్లు గట్టి పోటీ ఇచ్చేవాళ్లే. మరి ఈ ఐదుగురిలో ఎంతమంది పార్లమెంట్‌లో అడుగుపెడతారో చూడాలి.