సంక్రాంతి రైళ్లు ఫుల్ : వెయిటింగ్ లిస్టు వందల్లో

  • Published By: chvmurthy ,Published On : September 14, 2019 / 03:49 AM IST
సంక్రాంతి రైళ్లు ఫుల్ : వెయిటింగ్ లిస్టు వందల్లో

దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తున్నాయంటే తెలుగు ప్రజలకు ప్రాణం లేచి వస్తుంది. ఉద్యోగాల కోసం సొంతూరు వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం వచ్చిన వారు ఈ 3 పెద్ద పండుగలకు సొంతూరు వెళ్లి ఆనందంగా పండుగ చేసుకుంటారు. ఇందుకోసం ముందుగానే రైలు టికెట్లు, బస్సు టికెట్లు బుక్ చేసుకోవటం పెద్ద ప్రహసనం. దూర ప్రాంతాలకు వెళ్లేవారికి రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. తక్కువ ఖర్చులోనూ అయిపోతుంది. దసరా, దీపావళి సీజన్ కు సంబంధించి రైల్వే టికెట్లు అయిపోయినా సంక్రాంతికి నాలుగు నెలల ముందు నుంచే బుకింగ్స్ ప్రారంభించింది రైల్వే శాఖ. దసరా, దీపావళికి వెళ్లని వారు తప్పని సరిగా సంక్రాంతికి మాత్రం సొంతూరు పయనమవుతారు. ప్రతి ఏటా ఈ పండగలకు రద్దీ ఉంటుందని తెలిసినా  రైల్వే శాఖ  వేసే ప్రత్యేక రైళ్లు సరిపోవటంలేదు. ఎన్ని ప్రత్యేక రైళ్లు వేసినా రైళ్ళన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. దీంతో ప్రయాణికుల రద్దీకీ తగినన్నిరైళ్లు వేయలేక పోతోందనే విమర్శలు తలెత్తుతున్నాయి.

2020 సంక్రాంతికి హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి  తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు అప్పుడే రిజర్వేన్లు ప్రారంభమయ్యాయి. టికెట్ బుక్ చేసుకుందామనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికే చాలా రైళ్లలో టికెట్లు అయిపోయినాయి. ఇక వచ్చే టికెట్లన్నీ వెయిటింగ్ లిస్టులోనే ఉన్నాయి. ఒక్కోరైల్లో వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంటోంది. కొన్ని రైళ్లలో వెయ్యి దాటుతోంది. అయితే ఇన్ని టికెట్లు వెయింటిగ్ లిస్టులో ఇవ్వటంపై  రైల్వే శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలమంది  ప్రయాణికులు వెయిటింగ్ లిస్టులో టికెట్ తీసుకున్నప్పటికీ వీటిలో ఎక్కువ శాతం టికెట్లు రద్దు చేసుకుంటారు. దాంతో  రైల్వేశాఖకు భారీగా ఆదాయం వచ్చి పడుతోంది.

టికెట్లు రద్దు, సర్వీసు చార్జి, పేరుతో ప్రయాణికుడి జేబుకు  మాత్రం చిల్లుఖాయం. రిజర్వేషన్ ఖరారు కానీ ప్రయాణికులు టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే స్లీపర్ టికెట్ చార్జికి ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.60 వసూలు చేస్తారు. ఇంట్లో నలుగురి టికెట్లు క్యాన్సిల్ చేస్తే రూ. 240 నష్ట పోతారు. అదే ఐఆర్ సీటీసీ ద్వారా అయితే ఈరద్దు చార్జీలు భారం మరింత పెరుగుతుంది. సాధారణంగా ఒక రైల్లో 24 బోగీలు ఉంటాయి. 2 గార్డు బోగీలు తీసేస్తే ప్రయాణానికి ఉండేవి 22 బోగీలు. వీటిలో 12 నుంచి 14  వరకు స్లీపర్ క్లాస్ బోగీలు ఉంటాయి.  ధర్డ్ ఏసీ 3, సెకండ్ ఏసీ 3, జనరల్ 4 ఉంటాయి. మొత్తంగా రిజర్వేషన్ బోగీల్లో ఉండే అన్ని సీట్లు 1100 నుంచి 1200 లోపు ఉంటాయి. కానీ  రైల్వే శాఖ  రెట్టింపు సంఖ్యలో వెయిటింగ్  లిస్టు టికెట్లు జారీ చేయటం పట్ల సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.  వివిధ రైళ్లలో స్లీపర్ క్లాసులు ఏసీ లుకూడా ఫుల్ అయిపోయాయి. సంక్రాంతి  పండుగకు వెళ్లే రైళ్లలో ఇప్పటికే వెయిటింగ్ లిస్టు వందల సంఖ్యకు చేరటంతో ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.