పంచాయతీలకే అధికారాలు : దిశానిర్దేశం చేసిన కేసీఆర్

  • Published By: chvmurthy ,Published On : February 6, 2019 / 04:20 PM IST
పంచాయతీలకే అధికారాలు : దిశానిర్దేశం చేసిన కేసీఆర్

హైదరాబాద్ : రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీల అధికారాలను బదలాయించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పల్లె సీమలు ప్రగతిపథంలో పయనించే విధంగా చూడాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన పంచాయతీల పాలకవర్గాలతో పాటు కార్యదర్శులపై ఉందని సీఎం కేసీఆర్ అన్నారు
తెలంగాణలో కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రిసోర్స్‌ పర్సన్స్‌కు  బుధవారం ప్రగతి భవన్ లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రిసోర్స్‌ పర్సన్స్‌కు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ట్రైనింగ్‌ పొందిన రిసోర్స్‌ పర్సన్స్  గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు శిక్షణ ఇవ్వనున్నారు.
 
గ్రామాల అభివృద్ధికి అధికారులు, పంచాయతీల పాలకవర్గాలు కలిసి పనిచేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులే తీసుకోవాలని  సీఎం ఆదేశించారు. మంచినీరు, విద్యుత్‌ సరఫరా, రహదారులు, శ్మశాన వాటికల నిర్మాణం, నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంచడంపై పంచాయతీలు ఎక్కువగా దృష్టి సారించాలని ఆయన సూచించారు.
 
కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో ఉన్న నియమనిబంధలను కూడా కేసీఆర్‌ గుర్తు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సర్పంచ్‌లపై చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడే గ్రామ కార్యదర్శులను సస్పెండ్‌ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులను మార్పుకు ప్రతినిధులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత రిసోర్స్‌ పర్సన్స్‌పై ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.