ప్రభుత్వ డాక్టర్ నిర్వాకం.. వీడియో కాల్ మాట్లాడుతూ సిజేరియన్, బాలింత మృతి

  • Published By: naveen ,Published On : September 2, 2020 / 08:31 AM IST
ప్రభుత్వ డాక్టర్ నిర్వాకం.. వీడియో కాల్ మాట్లాడుతూ సిజేరియన్, బాలింత మృతి

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి లేకుండా చేసింది. డాక్టర్ నిర్లక్ష్యంతో సిజేరియన్‌ ఆపరేషన్ వికటించి బాలింత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎస్సార్‌నగర్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
https://10tv.in/17-year-old-girl-raped-by-3-men-on-separate-occasions-in-tamilnadu-found-to-be-8-months-pregnant/
గాయత్రిహిల్స్‌లోని నవభారత్‌నగర్‌కు చెందిన ఎం.జానకి(23)కి పురిటినొప్పులు ఎక్కువవడంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 28న ఉదయం శ్రీరామ్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. 29న అర్ధరాత్రి 2.30 గంటలకు ఆసుపత్రిలోని మహిళా డాక్టర్, మరో నర్సు, ఇతర సిబ్బంది సిజేరియన్‌ చేయగా మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత జానకి ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున 4.30 గంటలకు నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 30న ఉదయం ఆమె మృతి చెందింది.

జానకి మృతికి శ్రీరామ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, నర్సు నిర్లక్ష్యమే కారణం అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శస్త్రచికిత్స చేసిన సమయంలో ఓ నర్సు, మరో వైద్యురాలు వీడియో కాల్‌ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో ఆపరేషన్‌ వికటించి జానకి మృతి చెందిందని చెబుతున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిర్లక్ష్యం కింద వైద్య సిబ్బందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే నిజాలు వెల్లడిస్తామన్నారు. ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

అసలే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే జనాలకు నమ్మకం పోయింది. ప్రాణం మీద ఆశ లేని వారే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారనే అభిప్రాయం ఉంది. సర్కారీ దవాఖానాల్లో డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటారని, సిబ్బంది పట్టించుకోరని, వైద్యం సరిగా చేయరని విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి పేరు వింటే చాలు సగం ప్రాణాలు పైకి పోతాయి. కొందరు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆ ఆరోపణలను, విమర్శలను నిజం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను తీస్తున్నారు. ఇప్పటికైనా వారిలో మార్పు రాకుంటే ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుందని జనాలు అంటున్నారు.