తప్పెవరిది : మహిళ కడుపులో కాటన్

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 04:13 AM IST
తప్పెవరిది : మహిళ కడుపులో కాటన్

సిద్దిపేట: ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయిన బాలింత కడుపు నుంచి కాటన్‌ బయటపడిన ఘటన ఫిబ్రవరి 4 న బైటపడింది. డెలివరీ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లిన తరువాత తరచూ కడుపునొప్పి రావడంతో ప్రయివేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకోగా ఈ విషయం వెలుగుచూసింది. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే బాలింత ఇబ్బందులకు గురైందని కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
 

కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన స్వప్న ఫిబ్రవరి 13న డెలివరీ కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి 14న ఉదయం నార్మల్‌ డెలివరీ చేశారు. పాప జన్మించింది. డెలివరీ అనంతరం వైద్యులు ఆమెకు రెండు కుట్లు వేసి రక్తస్రావం జరుగుతుందని ఒక కాటన్‌ ప్యాడ్‌ పెట్టారు. కానీ దాన్ని తొలగించకపోవడంతో ఆరు రోజుల తర్వాత ఆమెకు జ్వరం, కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమెను ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు స్కాన్ చేసిన ఇన్ఫెక్షన్‌ అయ్యిందని రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచాలన్నారు. కానీ స్వప్న బంధువులు వినకుండా ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. 
 

ఇంటికెళ్లిన తరువాత స్వప్నకు జర్జరీ జరిగిన చోట ఓ ప్యాడ్‌ కనబడడంతో దానిని తొలగించింది. దీంతో స్వప్న బంధువులు  ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి కాటన్‌ ఎందుకు తొలగించలేదని..అందుకే ఆమెకు అనారోగ్యం వచ్చిందని..ప్రభుత్వాస్పత్రిని నమ్మి ప్రసవం కోసం వస్తే ఇదేంటని ఆగ్రహంతో ప్రశ్నిస్తు..సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 
విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని వారిని సర్ధి చెప్పారు.ఈ విషయమై సంబంధిత వైద్యాధికారిని వివరణ కోరగా స్వప్న కుటుంబ సభ్యులకు డిశ్చార్జి అయినప్పుడు రెండు రోజుల తర్వాత ప్యాడ్‌ను తొలగించి, చెకప్‌కు రావాలని చెప్పామనీ..కానీ వారు రాలేదనీ..దాంట్లో మా తప్పేంలేదని తెలిపారు. తప్పు వారి వద్ద ఉంచుకుని మమ్మల్ని నిందించటం సరికాదంటున్నారు డాక్టర్లు.ఆమెకు స్కానింగ్‌ చేశామని తల్లితోపాటు బిడ్ద సురక్షితంగా ఉందని చెప్పారు.