తెలంగాణలో అకాల వర్షాలు : రైతులకు కడగండ్లు

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 02:05 AM IST
తెలంగాణలో అకాల వర్షాలు : రైతులకు కడగండ్లు

తెలంగాణలో కురిసిన అకాల వర్షం అన్నదాత కడుపు కొట్టింది. గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వడగండ్ల వాన… రైతులకు కడగండ్లు మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. కోతకొచ్చిన వరి, మామిడి, మిరప లాంటి పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు పంట నష్టాన్ని అంచనా వేయాలని… ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది.

తెలంగాణలో గత పది రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగలంతా భరించలేని ఎండలు. సాయంకాలం ఊహించని వర్షాలు. వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి విచిత్ర పరిస్థితి నెలకొంటోంది. అంతేకాదు.. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు పడుతున్నాయి. అయితే తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చుతున్నాయి. కాలంకాని కాలంలో కురిసిన వర్షాలకు కంది, మిరప, మామిడి, పెసర, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంట కళ్లముందే వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, వరంగల్‌ రూరల్‌, జనగామ, సిద్దిపేట, మెదక్‌, వరంగల్‌ అర్బన్‌, ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

పలుచోట్ల కురిసిన అకాల వర్షాలకు మామిడి పంటకు భారీ నష్టం కలిగింది. వరి, మిర్చి పంటలు తడిసి పనికిరాకుండా పోయాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో దాదాపు రెండు వందల ఎకరాల్లో మామిడిపంట దెబ్బతింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్థన్నపేట, పరకాల, నర్సంపేట మండలాల్లో వరిపంట నేలకొరింది.  అరటి తోటల్లో గెలలు రాలిపడ్డాయి. మిర్చిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది.  కల్లాల్లోని మిరప నీటి పాలైంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆరువేల ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో 1500 ఎకరాల్లో వరి, 400 ఎకరాల్లో మొక్కజొన్న, 3000 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది.

ప్రస్తుత రబీకి నమోదు చేసుకునన రైతుల పంటలు వడగండ్ల వానతో దెబ్బతింటే… విపత్తు సంభవించిన 72 గంటల్లో ఇన్సూరెన్స్‌ కంపెనీలకు తెలియజేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఖరీప్‌, రబీలో గతంలో బకాయి క్లెయిమ్స్‌ల చెల్లింపుల నిర్దేశిత గడువు ఈనెల 20వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పంటనష్టం జరిగిన విషయాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న ఏఈవోల ద్వారా అంచనా వేసి బీమా కంపెనీలకు ప్రభుత్వమే పంపాలని రైతులు కోరుతున్నారు. పంటకోల్పోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. గతంలో జరిగినట్టుకాకుండా పరిహారం విషయంలో ప్రభుత్వం చొరవచూపి త్వరగా అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.