అకాల వర్షాలు..అపార నష్టం

  • Published By: madhu ,Published On : April 24, 2019 / 01:17 AM IST
అకాల వర్షాలు..అపార నష్టం

తెలుగు రాష్ట్రాలలో అకాలవర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో చేతికి అందివస్తాయనుకున్న పంటలు నేల పాలయ్యాయి. మామిడి, అరటి, వరి, జీడిమామిడి పంటలకు తీరని నష్టం జరగడంతో.. రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు పలుప్రాంతాల్లో రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

విజయనగరం జిల్లాలో గాలి వానకు మామిడి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. చాలా చోట్ల మామిడి కాయలు రాలిపోయాయి. పలు ప్రాంతాల్లో అరటి , జీడిమామిడి పంటలు దెబ్బతిన్నాయి. తోటలు కొనుగోలు చేసినవారు లబోదిబో మంటున్నారు. మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి.     
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో భారీ వర్షం కారణంగా బొప్పాయి పంటకు తీవ్ర నష్టం వాటిళ్లింది. రెండు మూడు రోజుల్లో పంట చేతికొస్తుందనగా బొప్పాయి చెట్లు, అరటి చెట్లు నేలకొరిగి.. కాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమను ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. 

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో గత మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు  అపార నష్టం జరిగింది. వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో పాటు పలుప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో జనజీవనం స్తంభించిపోయింది. 
ఇటు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అకాల వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది.  వర్షాలకు వరి పంట దెబ్బతింది. కల్లాల్లోని దాన్యం తడిసి ముద్దైంది. పెనుగాలులకు భారీ వృక్షాలు కూకటివేళ్లతో  పెకలించుకుని నేల కూలాయి. తాటిచెట్లు విరిగి రోడ్లుపై అడ్డంగా పడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పరిసరప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. లక్కవరం, దేవులపల్లి రహదారులపై భారీ వృక్షాలు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన వరి, మామిడి రైతులకు తీరని వేదనని మిగిల్చింది. పెద్ద ఎత్తున కోతకొచ్చిన వరి పంట, మామిడి తోటలు ధ్వంసం అయ్యాయి. వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వందల ఎకరాలలో మామిడి కాయలు నేలరాలాయి.
ఖమ్మం జిల్లా లింగాల ప్రధాన  రహదారి మర్రిగూడెం సమీపంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి.  వృక్షాలు కార్లమీద పడటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రెండు గంటలు దాటినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

హైదరాబాద్‌లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బషీర్‌బాగ్‌లోని చంద్రనగర్‌ బస్తీలో గాంధీ పాత మెడికల్ కాలేజ్‌ గోడ కూలిపోయింది. దీంతో గోడపక్కనే ఉన్న తొమ్మిది ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. నాలుగు కరెంట్ స్థంభాలు నేలకొరగగా.. ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.